అవినాష్‌రెడ్డి అరెస్టా? నోటీసులా?

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డి విచార‌ణ సినిమాను త‌ల‌పిస్తోంది. ఈ ఎపిసోడ్ హైద‌రాబాద్‌, పులివెందుల కాకుండా క‌ర్నూలు కేంద్రంగా న‌డ‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌త రెండు ద‌ఫాలుగా సీబీఐ విచార‌ణ‌కు వివిధ కార‌ణాల…

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో అవినాష్‌రెడ్డి విచార‌ణ సినిమాను త‌ల‌పిస్తోంది. ఈ ఎపిసోడ్ హైద‌రాబాద్‌, పులివెందుల కాకుండా క‌ర్నూలు కేంద్రంగా న‌డ‌వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌త రెండు ద‌ఫాలుగా సీబీఐ విచార‌ణ‌కు వివిధ కార‌ణాల రీత్యా అవినాష్‌రెడ్డి హాజ‌రు కాలేదు. చివ‌రిగా ఈ నెల 19న హైద‌రాబాద్‌లోని సీబీఐ కార్యాల‌యానికి విచార‌ణ‌కు బ‌య‌ల్దేరిన అవినాష్‌కు త‌ల్లి శ్రీ‌ల‌క్ష్మి అనారోగ్య స‌మాచారం అందింది.

దీంతో ఆయ‌న పులివెందుల‌కు బ‌య‌ల్దేరారు. మార్గ‌మ‌ధ్యంలో తాడిప‌త్రి వ‌ద్ద త‌ల్లిని ప‌రామ‌ర్శించారు. అక్క‌డి నుంచి క‌ర్నూలుకు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం క‌ర్నూలులోని విశ్వ‌భార‌తి ఆస్ప‌త్రిలో అవినాష్‌రెడ్డి త‌ల్లికి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ నెల 22న విచార‌ణ‌కు రావాల‌ని మ‌రోసారి సీబీఐ నోటీసులు ఇవ్వ‌డం, ప‌ది రోజుల గ‌డువు కావాల‌ని అవినాష్‌రెడ్డి లేఖ రాయ‌డంతో ఉత్కంఠ‌కు తెర‌లేపింది.

అవినాష్‌రెడ్డి అభ్య‌ర్థ‌న‌ను సీబీఐ తోసిపుచ్చింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ విచార‌ణ‌కు రావాల్సిందే అని తేల్చి చెప్పింది. కానీ అవినాష్ మాత్రం విచార‌ణ‌కు వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. దీంతో సీబీఐ అధికారులు సోమ‌వారం తెల్ల‌వారుజామున క‌ర్నూలుకు చేరుకున్నారు. 

క‌ర్నూలు ఎస్పీతో సీబీఐ అధికారులు భేటీ అయ్యారు. అనంత‌రం విశ్వ‌భార‌తి ఆస్ప‌త్రికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ నాయ‌కుడిని అరెస్ట్ చేయ‌వ‌ద్ద‌ని అవినాష్‌రెడ్డి అనుచ‌రులు ఆందోళ‌న‌కు దిగారు. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకే సీబీఐ అధికారులు క‌ర్నూలుకు వ‌చ్చిన‌ట్టు వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. క‌నీసం మాన‌వ‌త్వం లేకుండా త‌ల్లికి వైద్యం అందిస్తున్న అవినాష్‌కు కొంత స‌మ‌యం ఇచ్చేందుకు సీబీఐ అధికారులు విముఖ‌త ప్ర‌ద‌ర్శించ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు.

క‌ర్నూలులో విశ్వ‌భార‌తి ఆస్ప‌త్రి వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌డం, వైసీపీ శ్రేణుల ఆందోళ‌న‌ను ప‌రిశీలిస్తే ఏదో జ‌ర‌గ‌నుం ద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేస్తారా? లేక మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని ఆయ‌న‌కు నోటీసుల‌తో స‌రిపెడ‌తారా? అనేది కాసేప‌ట్లో తేల‌నుంది. విచార‌ణ గ‌డువు పొడిగించే ఉద్దేశం సీబీఐకి వుంటే… సంబంధిత అధికారులు క‌ర్నూలుకు వ‌చ్చే అవ‌కాశం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.