ఆరు నెలలలో ఏపీలో ప్రభుత్వం మారుతుంది అంటున్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. కళ్ళు మూసుకుంటే వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని అంటున్నారు. తమ్ముళ్ళూ కొద్ది కాలం ఓపిక పట్టండి, ఇక వచ్చేది మనమే అని ఆయన చెబుతున్నారు.
ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ టీడీపీ ప్రకటించిన మినీ ఎన్నికల మ్యానిఫేస్టోని జనంలో ప్రచారం చేయడం కోసం బస్సు యాత్రను చేపట్టారు. విశాఖ జిల్లా నర్శీపట్నంలో ఆ యాత్ర సందర్భంగా అయ్యన్న పోలీసుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం విశేషం. అంబేద్కర్ ఇచ్చిన హక్కు తనకు మాట్లాడడం అన్నారు అయ్యన్న.
తాను ఎంత అయినా మాట్లాడుతానని అన్నారు. నా మీద ఎన్ని కేసులు అయినా పెట్టుకోవచ్చు జైలులో పెట్టినా ఇదే మాట అని అన్నారు. ఏమి పీక్కుంటారో పీక్కోండి అని అయ్యన్న చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంటనే పోలీసుల సంగతి చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడమూ విశేషం. ఒక్కొక్కరి జాబితాను రెడీ చేస్తున్నామని ఎవరినీ వదిలేది లేదు అంటూ అయ్యన్న చెబుతున్నారు.
పోలీసు మంత్రిగా తనకు చాన్స్ ఇవ్వమని కూడా ఆయన చంద్రబాబుని కోరుతున్నారు. లా అండ్ ఆర్డర్ శాఖ కావాలట. చంద్రబాబు సీఎం కాలేదు కానీ అయ్యన్న మంత్రి అయిపోయారు, శాఖ కూడా సెలెక్ట్ చేసేసుకున్నారు. గతంలో కూడా ఆయన తాను హోం మంత్రి అవుతాను అని స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసు మంత్రి మీద అయ్యన్న మోజు ఒక రేంజిలో ఉంది. మీ భవిష్యత్తుకు మా గ్యారంటీ అంటూ జనంలోకి వస్తున్న తెలుగుదేశం నాయకులు తమ పదవులకు తమ భవిష్యత్తుకు గ్యారంటీ అని చెప్పుకుంటున్నారా అని సెటైర్లు అయితే పడుతున్నాయి.