ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేసిందన్న చందంగా, కేవలం ఒకే ఒక్క భయం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును మార్చేస్తోంది. చంద్రబాబు మేల్కొన్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇంత కాలం తన చుట్టూ తిరిగే వాళ్లే నిజమైన నాయకులని నమ్మి మోసపోయాననే పశ్చాత్తాపం ఆయనలో కనిపిస్తోంది. ఇట్లే కొనసాగితే టీడీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని ఆయన గ్రహించినట్టున్నారు. దీంతో ఆయనలో అనూహ్య మార్పు కనిపిస్తోంది.
ఇంత కాలం తాను, పార్టీ నాయకుల కోసం పనిచేశామనే భావన బాబు మాటల్లో కనిపిస్తోంది. అందుకు తగ్గట్టు నాయకులు పని చేయలేదనే ఆవేదన చంద్రబాబు మాటల్లో ప్రతిబింబిస్తోంది. ఈ నేపథ్యంలో నాయకుల పనితీరుపై నిఘా పెట్టాలని చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
‘పార్టీ నేతలు నా వద్దకు వచ్చి గొప్పలు చెప్పి పదవులు కొట్టేసే రోజులు పోయాయి. పనితీరు, సామర్థ్యాన్ని విశ్లేషించడానికి విధానం రూపొందిస్తున్నాం. ప్రతి సభ్యుడికీ డిజిటల్ కార్డు ఇస్తున్నాం. దానిపై నంబర్ కొట్టగానే పార్టీలో అతడి చరిత్ర మొత్తం మాకు కనిపిస్తుంది. ఎప్పటి నుంచి సభ్యుడు, గతంలో ఏయే పదవులు చేశాడు, అతడి నివాస ప్రాంతంలోని పోలింగ్ బూత్‌లో గత రెండు ఎన్నికల్లో పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి తదితర విషయాలన్నీ వస్తాయి. ఈ సమాచారమంతా సేకరిస్తున్నాం’ అని అన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే ఇక టీడీపీకి భవిష్యత్ ఉండదనే భయం చంద్రబాబును అప్రమత్తం చేసింది. అందుకే ప్రతి ఒక్కర్నీ కలుపుకెళ్లాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. రాజకీయంగా లాభపడేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ కోసం నిజంగా పని చేస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక సాప్ట్వేర్ వ్యవస్థను నెలకొల్పుతున్నారు.
గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి నేతల వరకూ అందరి జాతకాలను నిక్షిప్తం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక మీదట మాటలు చెప్పి, పదవులు కొట్టాలనుకునే వాళ్లకు చెక్ పెడతానని నేరుగానే హెచ్చరించారు. ఇదంతా కేవలం అధికారమనే భయమే చంద్రబాబును పూర్తిగా మార్చి వేస్తోందనే అభిప్రాయాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రయత్నాలు టీడీపీని ఏ మేరకు బలోపేతం చేస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.