మంత్రి పదవి వస్తే ఎవరికైనా సంతేషమే. అయితే ఆ సంతోషం రోజాలో ఇంకాస్త ఎక్కువ చూడొచ్చు. మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె, చివరి వరకూ టెన్షన్ టెన్షన్ గా గుళ్లు గోపురాలు చుట్టేసి దేవుళ్లను వేడుకున్నారు. ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నారు, మినిస్టర్ రోజా అనిపించుకున్నారు. అయితే ఆ సంతోషంలో ఆమె తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ లో జరిగిన స్పోర్ట్స్ అథారిటీ మీటింగ్ కి మంత్రి హోదాలో హాజరయ్యారు రోజా. మంత్రిగా ఇక్కడ తన తొలి సమావేశం కాబట్టి.. ముందుగా యూనివర్శిటిలోనీ జ్ఞానప్రద శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆమె సందర్శించారు. అక్కడికి కూడా రోజా అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆ సమయంలో దేవుడికి దండం పెట్టుకునేందుకు చేతులు జోడిస్తున్న క్రమంలో తన చేతిలోని సెల్ ఫోన్ ని పక్కనే ఉన్న పీఏకి అప్పగించారు. ఫోన్ పీఏకి ఇచ్చాననుకున్నారు రోజా. కానీ పక్కన ఉంది పీఏ కాదు, ఓ దొంగ.
రద్దీలో పర్సులు, సెల్ పోన్లు కొట్టేయడానికి అక్కడికి వచ్చాడా దొంగ. అయితే రోజా ఎంచక్కా సెల్ ఫోన్ ఆమె స్వహస్తాలతోటే అందించారు కాబట్టి, మహా ప్రసాదం అనుకుంటూ జేబులో వేసుకుని వెళ్లిపోయాడు. అందులోనూ అది ఐఫోన్. ఇక ఒక్క క్షణం ఆగకుండా పూజారి హారతి ఇచ్చేలోపు గుడి నుంచి మాయమయ్యాడు.
స్వామివారి ఆశీస్సులు తీసుకున్న రోజా.. నేరుగా సమీక్షకు వెళ్లారు, అక్కడ మీటింగ్ పూర్తయ్యాక తిరిగి కారు దగ్గరకు వచ్చారు. అప్పుడు గుర్తొచ్చింది ఫోన్. పీఏ ఫోన్ ఇటివ్వు అని అడిగారు. పీఏకి ఏం తెలుసు, ఫోన్ ఏంటి మేడమ్, మీ దగ్గరే ఉండాలికదా అన్నాడు. విషయం అర్థమైంది. గుడిలో ఫోన్ ఇచ్చింది తన పీఏకి కాదు, ఇంకెవరికో అనే విషయం గుర్తొచ్చింది. వెంటనే పోలీసులకు చెప్పడంతో వారిలో హడావిడి మొదలైంది.
మంత్రిగారి ఫోన్ మిస్సైంది అనే వార్త క్షణాల్లోనే బయటకు పొక్కింది. అయితే ఫోన్ అంత త్వరగా బయటకు రాదు కదా. దొంగ దాన్ని స్విచాఫ్ చేసి చెక్కేశాడు. పోలీసులు లబోదిబోమన్నారు. మంత్రిగారి ఫోన్ కి కూడా భద్రత లేదా అనే కామెంట్లు సోషల్ మీడియాలో పెరిగిపోవడంతో.. దొంగని వెదికే పనిలో పడ్డారు తిరుపతి పోలీసులు. మొత్తమ్మీద.. మంత్రి పదవి వచ్చినందన్న సంతోషంలో ఉన్న రోజా.. ఇలా తనకు తెలియకుండానే తన ఫోన్ దొంగ చేతిలో పెట్టారు.
165 నిముషాల ఆపరేషన్..
పోలీసులు ఈ ఫోన్ దొంగతనం కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిగ్నల్ ట్రేస్ చేశారు. రుయా అస్పత్రి దగ్గర దొంగను పట్టేశారు. 165 నిముషాల్లో ఫోన్ రికవరీ చేసి రోజా చేతిలో పెట్టారు. మంత్రిగారి ఫోన్ అంటే ఆమాత్రం స్పీడ్ యాక్షన్ ఉండాలి మరి.
యమలీల వంటి కొన్ని సినిమాల్లో రోజా కూడా లేడీ దొంగగా నటించి మెప్పించారు. ఇప్పుడామెకు నిజ జీవితంలోనే ఇలా దొంగ ఎదురయ్యాడు. ఆమె చేతిలోనుంచే దొంగ లాఘవంగా సెల్ ఫోన్ తీసుకెళ్లాడు, చివరకు పోలీసులకు చిక్కాడు.