ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అంటే దేశ వ్యాప్తంగా కింగ్ మేకర్ అనే పేరుంది. ప్రశాంత్ కిశోర్‌ను వ్యూహకర్తగా నియమించుకుంటే విజయం సాధించి పెడతారనే నమ్మకం రాజకీయ పార్టీల్లో బలంగా ఉంది. వైఎస్ జగన్‌కు వ్యూహకర్తగా పని చేయడం, వైసీపీ అద్వితీయ విజయం సాధించడంతో ప్రశాంత్ కిశోర్ పేరు తెలుగు సమాజానికి బాగా తెలిసొచ్చింది. మమతాబెనర్జీ, స్టాలిన్‌లకు కూడా ఆయన వ్యూహకర్తగా పని చేశారు. ఇటీవల ప్రశాంత్ కిశోర్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ తరచూ సమావేశం అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన మనుగడ కోసం ప్రశాంత్ కిశోర్‌ను ఆశ్రయించడం గమనార్హం. గత మూడు నాలుగు రోజులుగా ప్రశాంత్ కిశోర్‌తో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సీరియస్ చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌లో ప్రశాంత్ చేరుతారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పునరుత్థానానికి ప్రశాంత్ కిశోర్ ప్రజెంటేషన్ వెల్లడైంది. ప్రజెంటేషన్ చూస్తే… ఓయబ్బా ఈ మాత్రం సంబడానికి కోట్లాది రూపాయలు ప్రశాంత్ కిశోర్‌పై కుమ్మరించాలా? అనే ప్రశ్న తలెత్తకుండా ఉండదు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లోని 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదన వరకూ ఓకే. తెలంగాణలో ఒంటరిగా, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ఆయన ప్రతిపాదించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీలో వైఎస్ జగన్‌తో కలిసి పని చేసిన ప్రశాంత్ కిశోరేనా ఈ ప్రతిపాదన చేసిందనే అనుమానం కలుగుతోంది. తనను 16 నెలల పాటు జైలుపాలు చేసి, కుటుంబాన్ని నడిరోడ్డుపై నిలిపిన కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోడానికి జగన్ అంగీకరిస్తారని ప్రశాంత్ ఎలా వూహించారో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీని బద్ద శత్రువుగా జగన్ పరిగణిస్తారు.
జగన్‌తో సంబంధం లేకుండా సోనియా, ప్రశాంత్ కిశోర్ అనుకుంటే వైసీపీతో పొత్తు కుదురుతుందా? అయినా అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్‌ను బతికించాలని తనను తాను జగన్ బలిపెట్టుకుంటారని ప్రశాంత్ కిశోర్ ఎలా అనుకుంటున్నారు? ఆచరణ యోగ్యమయ్యే సలహాలు ఇచ్చి వుంటే బాగుండేది. జగన్‌ను ప్రశాంత్ కిశోర్ అర్థం చేసుకోలేదని అనుకోడానికి ఆయన ప్రతిపాదనే నిదర్శనం.
తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో ఎన్సీపీ, పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి వెళితే మంచిదని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించడం మరో విడ్డూరం. ఇప్పటికే డిఎంకే, ఎన్సీపీతో కాంగ్రెస్ పొత్తులో ఉంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల తనకు రాజకీయంగా లాభం లేదనే మమతాబెనర్జీ దూరంగా ఉన్నారు. పొత్తులంటే రాజకీయ లాభనష్టాల పునాదులపై ఆధార పడి వుంటాయి.
కాంగ్రెస్ కథ కంచికే అని ఎన్నికల ఫలితాలు సంకేతాలు ఇస్తున్న పరిస్థితుల్లో సోనియా, రాహుల్, ప్రశాంత్ కిశోర్ కోసం ఏ రాజకీయ నాయకుడైనా పొత్తు కోసం ముందుకొస్తారా? ఇంతకూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ప్రశాంత్ కిశోర్ మార్క్ ఏముందో కాంగ్రెస్ అగ్రనేతలకే తెలియాలి. ఎందుకంటే ఊహలకు, నిజాలకు ఆకాశానికి, భూమికి ఉన్నంత దూరం కాబట్టి!