ఆన్ లైన్లో రోజుకో కొత్త మోసం పుట్టుకొస్తోంది. చాలామందికి అవగాహన లేకపోవడంతో ఆన్ లైన్లో మోసాలకు బలైపోతున్నారు. తాజాగా వాట్సాప్ డీపీతో మోసం చేసిన ఘటన ఒకటి అదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. సాక్ష్యాత్తూ జిల్లా కలెక్టర్ ఫొటోతో మోసాలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి..
ఇంతకీ ఏం జరిగింది..
నిన్న సాయంత్రం అధికారులతో సమావేశం ఏర్పాటుచేశారు అదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్. మీటింగ్ మధ్యలో కొంతమంది అధికారులకు వాట్సాప్ మెసేజీలు వచ్చాయి. ఏంటా అని తెరిచి చూస్తే, కలెక్టర్ అంటూ వచ్చిన మెసేజీలు అవి. వాట్సాప్ డీపీలో కలెక్టర్ ఫొటో ఉంది. మెసేజీ చూస్తే అర్జెంట్ గా డబ్బులు కావాలని ఉంది. ఎదురుగా చూస్తే కలెక్టర్ కళ్లముందు ఉన్నారు.
దీంతో అక్కడే ఉన్న అధికారులు కొందరు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే కలెక్టర్ పోలీసుల్ని ఆదేశించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అంతలోనే కొంతమంది మోసపోయారు. కలెక్టర్ డీపీ ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి మెసేజ్ రావడంతో.. ఓ గవర్నమెంట్ డాక్టర్, లక్ష రూపాయల విలువైన అమెజాన్ కూపన్లను పంపించాడు.
అయితే ఆ వెంటనే అట్నుంచి మరో సందేశం వచ్చింది. మరో లక్షన్నర కావాలంటూ మెసేజ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన డాక్టర్ వెంటనే క్రాస్ చెక్ చేసుకున్నాడు. కలెక్టర్ కాదని నిర్థారించుకున్నాడు. అమెజాన్ కూపన్లను బ్లాక్ చేశాడు. అయితే అప్పటికే 3 కూపన్లను అతడు వాడేశాడు.
ఇలా చాలామందికి కలెక్టర్ డీపీతో వాట్సాప్ మెసేజీలు వెళ్లాయి. ఈ ఆన్ లైన్ మోసంలో ఎంతమంది మోసపోయారనేది ఈరోజు తేలుతుంది. గతంలో సాయిధరమ్ తేజ్ విషయంలో కూడా ఇలానే జరిగింది. ఫేస్ బుక్ ప్రొఫైల్ తో మోసం చేసే ప్రయత్నం చేశాడు అగంతకుడు. ఇలా అపరిచిత నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ మెసేజీల్లో డీపీలు చూసి మోసపోవద్దని కోరుతున్నారు పోలీసులు.