జగన్ ఓ పోరాట యోధుడు అని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలిసింది. ఆయన ఓ గొప్ప ముఖ్యమంత్రి అని కేవలం మూడేళ్ల పాలనలోనే తెలిసొచ్చింది. ఇప్పుడాయన గొప్ప ట్రబుల్ షూటర్ అనే విషయం అందరికీ అర్థమవుతోంది. పార్టీలో అసంతృప్తి ఇలా వచ్చిన వెంటనే అలా చల్లారుస్తున్నారు. లోపల జగన్ ఏం చెబుతున్నారో తెలీదు కానీ బయటకొచ్చిన తర్వాత అంతా సైలెంట్ అయిపోతున్నారు. జగన్ నాయకత్వ లక్షణాల్లో ఇది కూడా ఒకటి.
మొన్నటికి మొన్న మంత్రి పదవులు కోల్పోయిన 13 మందిని కూడా జగన్ ఇలాగే బుజ్జగించారు. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీలో ముసలం మొదలైందని, అసంతృప్తులందర్నీ తమవైపు తిప్పుకోవచ్చని టీడీపీ గోతికాడ నక్కలా కాచుకు కూర్చుంది. ఒకరిద్దరు అసమ్మతి స్వరాలు వినిపించే సరికి చంద్రబాబులో దురాశ పుట్టింది. కానీ జగన్ అంత ఛాన్స్ ఇవ్వలేదు. మంత్రి పదవులు కోల్పోయిన వారిలో చాలామందిని నేరుగా ఆయన బుజ్జగించారు. మంత్రి పదవి రాలేదని బాధపడుతున్న ఆశావహుల్ని కూడా ఆయన సముదాయించారు, సజ్జలతో సముదాయింపజేశారు. భవిష్యత్ మీదేననే భరోసా ఇచ్చారు.
గతంలో కూడా అక్కడక్కడ ఎమ్మెల్యేల చేరికతో ఇబ్బంది పడ్డ పార్టీ నేతల్ని జగన్ ఇలాగే సముదాయించారు. వల్లభనేని వంశీ, కరణం బలరాం, రాపాక వరప్రసాద్.. నియోజకవర్గాల్లో స్థానికంగా అప్పటికే ఉన్న నేతలు ఇబ్బంది పడినా జగన్ ఆ వ్యవహారాలన్నీ సెట్ రైట్ చేశారు. చేయి చేయి కలిపారు, కుదరదన్నవారికి వేర్వేరు బాధ్యతలు అప్పగించారు.
తాజాగా నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్ని కూడా జగన్ సెట్ రైట్ చేశారు. అక్కడ కాకాణి-ఆనం, అనిల్ వర్గాల మధ్య జరుగుతున్న గొడవకు ఫుల్ స్టాప్ పెట్టారు. సహజంగా ఇలాంటి ఫైట్ జరుగుతుందని తెలిసినా అధినేతలు పెద్దగా పట్టించుకోరు. జిల్లాల్లో రెండు వర్గాలను ప్రోత్సహిస్తుంటారు. కానీ జగన్ మాత్రం చంద్రబాబులాగా విభజించి, పాలించు టైప్ కాదు. ఇద్దర్నీ వెంటనే పిలిపించి వెంటనే మందలించారు. ఇంతకంటే ఇంకెవరూ ముందుకెళ్లడానికి వీళ్లేదన్నారు. మీడియాకెక్కి పరవు తీయొద్దని, పార్టీని బలహీన పరచొద్దని, అంతదూరం వస్తే తనకు ఎవరూ ఎక్కువ, తక్కువ కాదనే సంకేతాన్ని పంపించారు.
లోపల ఏం జరిగిందో ఏమో.. మధ్యలో సజ్జల దగ్గర డిక్టేషన్ తీసుకున్నారేమో తెలియదు కానీ, బయటికొచ్చి మీడియాతో అంతా బాగానే ఉంది, అసలు మేమొచ్చింది గొడవల పరిష్కారం కోసం కాదని చెప్పి వెళ్లిపోయారు అనిల్, కాకాణి. అట్లుంటది జగన్ తోటి.