ఏపీలో మంత్రుల శాఖలు మారిపోతాయన్న విషయంలో వాస్తవం లేదని తేలిపోయింది. బొత్స సహా మిగిలిన మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. సంతకాలు పెట్టేశారు. నిన్న మొన్నటి వరకూ బాధ్యతల స్వీకరణలో కాస్త వెనకా ముందూ ఆలోచించిన బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అధికారులతో సమీక్ష నిర్వహించారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు పరీక్షలవేళ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని చెప్పారు.
ఈనెల 27నుంచి మే 9 వరకు పరీక్షలు జరిగే రోజుల్లో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ కూడా ప్రకటించింది. టెన్త్ క్లాస్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మంత్రి బొత్స అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖకు సంబంధించి అమలవుతున్న పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారాయన.
మంత్రులకు తమ శాఖల కేటాయింపులపై అసంతృప్తి ఉందని, వారు శాఖల మార్పు కోరుకుంటున్నారని, అందుకే బాధ్యతల స్వీకరణ ఆలస్యమవుతోందని నిన్న మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. ముఖ్యంగా బొత్స మళ్లీ తన మున్సిపల్ శాఖను కోరుకుంటున్నారని, అందుకే ఆయన సీఎం జగన్ చేపట్టిన తొలి సమీక్షకు కూడా రాలేదని వార్తలొచ్చాయి.
ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ తాజాగా బొత్స, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గుడివాడ అమర్ నాథ్, పీడిక రాజన్న దొర, కాకాణి గోవర్దన్ రెడ్డి కూడా బాధ్యతలు చేపట్టి తమ పనుల్లో నిమగ్నం అయ్యారు.
మొత్తమ్మీద 11మంది పాత మంత్రులతో పాటు 14మంది కొత్తవారు కూడా సెకండ్ ఫేజ్ లో మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. గతంలో మంత్రుల రివ్యూ మీటింగ్ లు, పర్యటనలు ఈ స్థాయిలో ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మంత్రుల హడావిడి కాస్త పెరిగిందనే చెప్పాలి. అందులోనూ కొత్తగా బాధ్యతలు చేపట్టినవారికి సొంత జిల్లాల్లో ఘన స్వాగతం లభిస్తోంది. తమ శాఖలపై తమదైన ముద్ర వేస్తామని చెబుతున్నారు కొత్త మంత్రులు.