సమయం, సందర్భం లేకుండా ప్రతి అంశాన్ని తన క్రెడిట్ లో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటు. దాన్ని అంతే గుడ్డిగా ప్రచారం చేయడం ఎల్లో మీడియాకు ఇంకా అలవాటు. గతంలో అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది తానే అని చెప్పుకున్నాడు బాబు. రాష్ట్రానికి మొబైల్ ఫోన్లు తీసుకొచ్చింది కూడా తానే అని ప్రకటించుకున్నారు.
అంతేకాదు, గతంలో దేశవ్యాప్తంగా మొబైల్ రేట్లు తగ్గడానికి కూడా తానే కారణం అని చెప్పుకున్నాడు. ఇప్పుడు బాబు నోటి నుంచి మరో ఆణిముత్యం జాలువారింది. “జగన్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే కరోనా వచ్చింది. అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చేది కాదు. అవునా కాదా తమ్ముళ్లు” అంటూ కొత్త కామెడీ అందుకున్నారు.
నవ్వుకుంటున్నారు బాబూ..!
అవునా కాదా తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు అడిగే ప్రశ్నలకు టీడీపీ కార్యకర్తల నుంచి నవ్వులే సమాధానంగా వస్తాయి. ఆ నవ్వుల్ని చూసి బాబు తెగ ఫీలయిపోతుంటారు. తాను అడిగిన ప్రశ్న అంత బాగా ఉందని అనుకుని ఉంటారు. కానీ చంద్రబాబు మాటల నుంచే కామెడీ పుడుతోంది. ఆ కామెడీకే జనం పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు, దాన్ని బాబు అర్థం చేసుకోలేకపోతున్నారు.
తాజాగా కరోనాపై బాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి నవ్వులు పూయించాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే కేవలం ఏపీకే కరోనా వచ్చేది కాదా, లేక దేశం మొత్తం ఆయన రక్షణ కవచంగా నిలిచేవారా అని నవ్వుకుంటున్నారు. గతంలో తుపాను వచ్చినప్పుడు కూడా ఇలాంటి కామెడీనే చేశారు చంద్రబాబు. అరచేతితో సముద్రాన్ని అడ్డుకుంటున్నట్టు అప్పట్లో వచ్చిన ఫొటోలు కెవ్వు కామెడీ.
చిప్ చెడిన మాట నిజమే..?
ఇటీవల చంద్రబాబు మాటలు, చేతలకు పూర్తిగా సంబంధం చెడిపోయిందని వైసీపీ నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. విజయసాయిరెడ్డి నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. దాన్ని నిజం చేసేలా చంద్రబాబు పదే పదే ఇలా నవ్వులపాలయ్యే మాటలు మాట్లాడుతున్నారు. ఓవైపు బీద అరుపులు అరుస్తూ, మరోవైపు ఎక్కడలేని గాంభీర్యం తెచ్చుకొని వార్నింగులు ఇస్తున్న బాబును చూసి ప్రజలు జాలిపడుతున్నారు.
చాదస్తం ఎక్కువైందా..?
ముసలి వారికి చాదస్తం ఎక్కువవుతుందనేది తెలిసిందే. చెప్పాల్సింది ఒకటి, చెప్పేది మరొకటి.. అలా ఉంటుంది వారి ప్రవర్తన. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చాదస్తంతో బాధపడుతున్నారు, తన చుట్టూ ఉన్నవారిని బాధపెడుతున్నారు. కరోనా వల్ల వచ్చిన కష్టాలు, తాను ముఖ్యమంత్రిగా ఉంటే ఆ స్థాయిలో ఉండేవి కావని చెప్పాలనుకున్నారు బాబు. కానీ ఏకంగా కరోనాయే వచ్చేది కాదని సెలవిచ్చారు.
గతంలో అధికారులకు.. కాస్త ఉష్ణోగ్రతలు తగ్గించండి అంటూ ఆదేశాలిచ్చి పరువుపోగొట్టుకున్న బాబు, ఇప్పుడు కరోనాయే రాకుండా చేసేవాడినని గొప్పుల చెప్పుకున్నారు. కరోనాని రాకుండా చేసి, ప్రకృతిని కూడా తన అధీనంలోకి తెచ్చుకునేంత సామర్థ్యం బాబుకి ఉంటే.. ఎన్నికల్లో అన్ని తక్కువ సీట్లు ఎందుకొచ్చాయో!