కేంద్రంలో మోడీ సర్కార్ అప్రతిహతంగా వెలిగిపోతోంది. మోడీ సర్కార్ ఒక వైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోంది. అదే విధంగా బంగారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలనుకుంటోంది. ఈ విషయంలో ఎంతసేపూ ఏపీ సర్కార్ ని తప్పుపడుతూ టీడీపీ తమ్ముళ్ళు కాలం వెళ్ళబుచ్చుతున్నారు.
మరి నిజంగా టీడీపీకి ఉక్కు కర్మాగారం పట్ల శ్రద్ధ, చిత్తశుద్ధి ఉంటే కనుక మోడీ సర్కార్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఉక్కు ఉద్యమకారులు కోరుతున్నారు. అదే సమయంలో స్వయంగా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం అయిన టీఎంటీయూసీ కూడా ఇదే రకమైన సూచన చేయడం విశేషం.
మహానాడులో విశాఖ స్టీల్ ని ప్రభుత్వ రంగంలో కొనసాగేలా చూడాలని కోరుతూ తీర్మానాన్ని చేయాలని చంద్రబాబుకు నాయకులు వినతి చేశారు. అదే విధంగా మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఖండించాలని కూడా టీఎంటీయూసీ నేతలు సూచిస్తున్నారు.
మూడేళ్ళుగా చూస్తే టీడీపీ ఎక్కడా మోడీ సర్కార్ ని పల్లెత్తు మాట అనడంలేదు. అంతే కాదు కేంద్రం ఏం చేసినా కిమ్మన్నాస్తిగా మౌనంగా ఉంటోంది. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తారా అంటే తీర్మానం చేయవచ్చు. అయితే ఎక్కడా మోడీ ప్రైవేటీకరణ పాలసీని ఖండించకుండా స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ సంస్థగా కొనసాగించాలని కోరుతూ సరిపెట్టవచ్చు అని అంటున్నారు.
మొత్తానికి కేంద్రం మీద టీడీపీ స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాటం చేయాలని ఉక్కు ఉద్యమకారులు ఎంతలా కోరుకుంటున్నా టీడీపీ కానీ చంద్రబాబు కానీ ఈ విషయంలో ముందుకు వస్తారా అన్నదే చర్చ. ఈ మధ్య బాబు విశాఖ వచ్చినపుడు కూడా ఉద్యమకారులు కలసి కేంద్రం మీద పోరాటానికి తమతో కలసి రావాలని కోరారు. ఏది ఏమైనా మహానాడులో స్టీల్ ప్లాంట్ తీర్మానం ఉంటుందా. ఉంటే ఎలా ఉంటుంది అన్నది చూడాలి.