సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఏపీ సర్కార్ కరుణించింది. సర్వీస్‌లోకి తీసుకుంటున్నట్టు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వివాదానికి ముగింపు పలికినట్టే.
టీడీపీ హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావు క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అసలు పని వదిలేసి, రాజకీయాలకు పాల్పడ్డారనేది వైసీపీ ఆరోపణ. భారీ సంఖ్యలో టీడీపీలోకి తమ ఎమ్మెల్యేలను చేర్చడంలో ఏబీ కీలకంగా వ్యవహరించారని మొదటి నుంచి వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీలో అధికార మార్పిడి కొందరికి కష్టాలు తెచ్చి పెట్టింది. ఇందులో ఏబీ వెంకటేశ్వరరావు ఒకరు. వెంకటేశ్వర రావు స్వీయతప్పిదాలే ఆయన్ను ఇబ్బందుల్లోకి నెట్టాయనే వాదన కూడా లేకపోలేదు.
సర్వీస్ నిబంధనలకు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే అభియోగాలపై ఏబీవీని ఏపీ సర్కార్ 2020, ఫిబ్రవరి 8న సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఆయన ఎలాంటి పోస్టింగ్ లేకుండా కాలం గడుపుతూ వచ్చారు.
సర్వీస్ నిబంధనల ప్రకారం రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించడానికి వీల్లేదు. అయినప్పటికీ ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు కొనసాగించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీ న్యాయపోరాటానికి దిగారు.
ఏబీ సస్పెన్షన్ ఎత్తి వేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సమర్థించింది.
ఏబీవీ సస్పెన్షన్ గడువు ఫిబ్రవరి 7తో ముగిసిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇకపై సస్పెన్షన్ చెల్లదని సర్వోన్నత న్యాయ స్థానం తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 8 నుంచి సర్వీసులో ఉన్నట్టు గుర్తించి ఆయనకు రావాల్సిన ప్రయోజనాలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ ఏబీవీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2022, ఫిబ్రవరి 8 నుంచి సర్వీస్ రీఇన్‌స్టేట్ చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ జీఏడీకి రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం.