కష్టంలో బాబు… భుజం భుజం కలపరా…?

టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబు ఇపుడు అతి పెద్ద కష్టంలో ఉన్నారు. కలలో సైతం ఆయన ఊహించని విధంగా జైలు జీవితం గడుపుతున్నారు. ఇది టీడీపీ చరిత్రలో చూసుకుంటే అతి పెద్ద సంక్షోభం…

టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న చంద్రబాబు ఇపుడు అతి పెద్ద కష్టంలో ఉన్నారు. కలలో సైతం ఆయన ఊహించని విధంగా జైలు జీవితం గడుపుతున్నారు. ఇది టీడీపీ చరిత్రలో చూసుకుంటే అతి పెద్ద సంక్షోభం అని చెప్పాలి. పార్టీ అధ్యక్షుడే అవినీతి కేసులో అరెస్ట్ అయి జైలులో ఉండడం టీడీపీకి షాక్ గా మారింది.

పార్టీ ఇపుడు ఒక్కటిగా నిలవాల్సిన తరుణం. అయినా కొందరు నేతలు ఇంకా మనసులు కలపడం లేదు. విశాఖ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ పట్ల జైలుకు పంపడం పట్ల ఆ ఇద్దరు మాజీ మంత్రులు విడివిడిగానే ఆందోళనలు చేస్తున్నారు. వారే అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు.

బాబుని అకారణంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారని రాజకీయ కష సాధింపు అని టీడీపీ ఆరోపిస్తూ విశాఖ పర్యటనలో ఉన్న గవర్నర్ ని కలసి ఫిర్యాదు చేసింది. అపుడు అచ్చెన్నాయుడు వెంట మాజీ మంత్రి గంటా ఉన్నారు. ఆయన ఇంటి వద్ద కుటుంబంతో కలసి వుయ్ స్టాండ్ విత్ బాబు అంటూ ప్ల కార్డులతో నిరసన చేశారు.

సీన్ కట్ చేస్తే విశాఖలోని టీడీపీ ఆఫీస్ వద్ద పార్టీ కార్యకర్తలతో కలసి మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి భారీ నిరసన చేపట్టారు. పోలీసులు ఈ నిరసనను భగ్నం చేసారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమంలో  అయ్యన్నతో పాటు గంటా కనిపించకపోవడం గమనార్హం.

ఇద్దరు మాజీ మంత్రులతో పాటు గంటా కూడా ఉంటే నిండుగా ఉండేదని పార్టీకి సరికొత్త బలంగా కనిపించేదని అంటున్నారు అయినా కష్టకాలంలో బాబు ఉన్నారు. ఇపుడు అంతా చేతులు కలపాల్సిన వేళ ఇద్దరు మాజీలు ఒక్కటిగా ఎందుకు కనిపించరు అన్న బాధ అవేదన అయితే పార్టీలో కనిపిస్తోందిట. రానున్న రోజులలో ఈ ఇద్దరూ ఒకే ఫోటోతో కనిపిస్తారేమో చూడాలని అంటున్నారు.