తెదేపాలో స్తబ్దత- భవిష్యత్తు ఆందోళనకరం

విమానం గాల్లో ఉండగా ప్రధాన పైలెట్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, కోపైలెట్ బాధ్యత తీసుకుంటాడు. అతను కూడా సమర్ధుడే అయి ఉంటాడు. వీళ్లిద్దరే కాకుండా మరొక సమర్ధవంతుడైన మూడవ పైలెట్ కూడా అవసరానికి అందుబాటులో…

విమానం గాల్లో ఉండగా ప్రధాన పైలెట్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, కోపైలెట్ బాధ్యత తీసుకుంటాడు. అతను కూడా సమర్ధుడే అయి ఉంటాడు. వీళ్లిద్దరే కాకుండా మరొక సమర్ధవంతుడైన మూడవ పైలెట్ కూడా అవసరానికి అందుబాటులో పక్కనే ఉంటాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ముగ్గురూ కలిసే భారీ విమానాన్ని నడుపుతూ ఉంటారు. సీనియారిటీల్లో తేడాలుండొచ్చు తప్ప ముగ్గురికీ విమానం నడపడానికి సంబంధించిన అన్ని విషయలు తెలిసే ఉంటాయి. 

ఇప్పుడు తెదేపాని కాసేపు ఒక విమానం అనుకుందాం. దానిని ఇప్పటివరకు నడిపింది చంద్రబాబు నాయుడు. సడెన్ గా ఆయన జైలుకెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు తాత్కాలిక పైలెట్టెవరు? 

ఒకటి రెండు రోజులు గడవకముందే తెదేపా నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ఒక విషయం తేటతెల్లం అయ్యుండాలి. అభిమానం కొన్ని సత్యాలు కనపడనీయదు. అయినప్పటికీ కాస్త కళ్లు నులుముకుని తేరిపార చూస్తే నిజం గోచరిస్తుంది. అదేంటంటే..చంద్రబాబు సీన్లో లేకపోతే తెదేపా పరిస్థితి అగమ్యగోచరం, ఆందోళనకరం, భయంకరం అని. 

బాలకృష్ణ పార్టీ ఆఫీసుకొచ్చి ఆపద్ధర్మంగా చంద్రబాబు స్థానంలో కూర్చున్నారు. అదే పెద్ద ఆపదగా కనిపిస్తోంది. 

పార్టీలో చంద్రబాబుకి సరితూగదగ్గ నెంబర్-2 నాయకుడు లేదనేది అవగతమయ్యింది. 

బాలకృష్ణ మాటతీరు, శైలి తెలియనివి కావు.  పార్టీని నడిపే శక్తి, యుక్తి, వాక్కు, వయసు, అనుభవం, పరిపక్వత..ఏవీ లేవు ఆయనలో. 

ప్రెస్మీటులో బావగారి అరెస్టుని నిరసిస్తూ స్వచ్ఛందంగా చేసిన  ప్రసంగం స్వచ్ఛంగానూ లేదు, అందంగానూ లేదు. అంతా గందరగోళం. “గార్ధభమ్మునకేల..” అంటూ మధ్యలో ఏదో తెలుగు పద్యం. అంత్యప్రాసలతో జగన్ మోహన్ రెడ్డిపై తిట్ల దండకం చదవడం…ఊకదంపుడు పదాలతో పసలేని ప్రసంగం చేయడం. 

ఆయనగారి మాటలు వింటూ చేష్టలుడిగి చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి పక్కనున్న నాయకులది. 

పోనీ లోకేష్ ఏమైనా ఆశాజనకంగా ఉన్నాడా అంటే అస్సలు లేడు. ఆ మధ్యన గోరంట్ల బుచ్చయ్యచౌదరి లాంటి వాళ్లే పార్టీ యువనాయకత్వం జూనియర్ ఎన్.టి.ఆర్ కి చెందాలని మాట్లాడడం పెద్ద చర్చకు దారి తీసింది. పార్టీ కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్.టి.ఆర్ జెండాలు ఊపడం స్వయంగా చంద్రబాబు కంట కూడా పడ్డాయి. 

అంటే లోకేష్ పనికొచ్చేలా లేడని పార్టీ కూడా గుర్తించినట్టే కదా! ఇదంతా ఒకప్పుడా అంటే కాదు. ఇప్పటికీ పరిస్థితిలో ఏమీ మార్పు లేదు. 

అంతే కాదు..చంద్రబాబు తనయుడిగా లోకేష్ కి గుర్తింపు తప్ప, తనకంటూ గుర్తింపు వచ్చే విధంగా ఒక్క ఆలోచన కానీ, ఒక్క ప్రసంగం కానీ జనం ముందు ప్రదర్శించలేకపోయాడు. మంత్రిగా పని చేసినప్పుడైనా, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంటూనైనా …ఇప్పటికీ ఈ తరానికి కావాల్సిన రీతిలో తన నాయకత్వ ప్రతిభని చూపలేకపోయాడు.

అంటే..ఏం చూపించాలని అడగొచ్చు. 

పక్క రాష్ట్రంలో కేటీయార్ ని చూస్తే తెలుస్తుంది. నాయకుడికి ప్రధానంగా కావాల్సింది భాషపై పట్టు, ఆలోచనని అందంగా జనం ముందు పెట్టగలిగే నేర్పు. ఎప్పుడేం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి,ఎలా మాట్లాడాలి అనే తూకం. కేటీయార్ తెలుగు, హింది, ఇంగ్లీష్, ఉర్దూల్లో అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఓవైసీల నోర్లు కూడా మూయించగలడు.

ఒక్క కేటీయార్ అనే కాదు. భారాసలో కేసీయార్ తర్వాత లైన్లో కవిత, హరీష్ రావులు కూడా గొప్ప వక్తలే. తెలివైనవాళ్లే. అలా వారసులో, సెకండ్ ఇన్ లైన్ నాయకులో బలంగా ఉంటే పార్టీపై జనానికి ఆసక్తి ఉంటుంది. 

మరి మన లోకేష్ పరిస్థితేంటి? వివరించాల్సిన అవసరం లేదు. 

ఒకరకంగా ఏ భాషలోనైనా అనర్గళంగా మాట్లడగలిగే నేర్పు నందమూరి వారసుడు జూనియర్ ఎన్.టి.ఆర్ కి ఉంది. కానీ అతను ప్రస్తుతం రాజకీయాలకి చాలా దూరంగా ఉన్నాడు. ప్రస్తుత తెదేపా కుటుంబంతో కూడా సత్సంబంధాలు లేవని తెలుస్తూనే ఉంది. చంద్రబాబు అరెస్టుపై కనీస స్పందన కూడా లేకుండా మౌనం వహించడమే దానికి నిదర్శనం. కళ్యాణ్ రాం కూడా తమ్ముడి దారే. 

మరి తెదేపాకి చంద్రబాబు తర్వాత నాయకత్వమేది? అంతా శూన్యమే అన్నట్టుంది. తెదేపా ఎప్పటికీ తమ కుటుంబపార్టీయే అని, తమ కుటుంబసభ్యులే నడుపుతారని ఆ మధ్యన ఒకసారి చెప్పారు బాలకృష్ణ. ఆ చొరవ, ఆలోచన ఆయనలో ఉన్నాయి. కానీ సామర్ధ్యమో! ఎవ్వరికీ కనిపించడంలేదు. 

రాజకీయాల్లో వాగ్ధాటితో పాటూ పీఆర్ కావాలి. ఎక్కడ, ఎప్పుడు ఎవర్ని కలవాలి, ఎవరితో సత్సంబంధాలు ఎలా ఉపయోగించుకోవాలి వంటివన్నీ తెలియాలి. కేడర్ కి, కార్యకర్తలకి గుర్తింపునిస్తూ వాళ్లని ఉత్సాహపరచాలి. అవన్నీ లోకేష్ కి గానీ, బాలకృష్ణకి కానీ ఎంతవరకు తెలుసో ఎవరికీ తెలీదు. 

ఏ రంగంలోనైనా వారసుల్ని బట్టే పెద్దవాళ్లకి కూడా సమాజంలో గౌరవం ఉంటుంది. ఒక తరంలో ఎంతో వెలుగు వెలిగిన కృష్ణకి ఈ తరంలో కూడా గౌరవం దక్కిందంటే మహేష్ బాబు వల్ల. అలాగే కృష్ణం రాజుని ఈ తరం కూడా గుర్తుపెట్టుకుందంటే ప్రభాస్ వల్ల. ఆ విధంగా వారసులు బలంగా ఉన్నప్పుడే వృద్ధాప్యంలో కూడా ప్రభ కొనసాగుతుంది. చంద్రబాబుకి వ్యక్తిగతంగా అయినా, పార్టీపరంగా అయినా లోకేష్ పనితీరుని బట్టే కష్టమో, సుఖమో ఉంటుంది. 

లోకేష్ ద్వారా కుదరని పక్షంలో ఇంకెవ్వరున్నారు పార్టీని నడపడానికి? పోనీ లోకేష్ నాయకత్వాన్ని పార్టీలో ఎంతమంది నాయకులు అంగీకరిస్తారు? 

ఇది లోకేష్ కి నిజమైన పరీక్ష. చంద్రబాబు నాయకత్వం కొనసాగుతున్నంతవరకూ లోకేష్ కి పార్టీలో గౌరవం దక్కుతూనే ఉంటుంది. కానీ ఇలా తండ్రి చాటు బిడ్డగానే కొనసాగుతూ కూర్చుంటే భవిష్యత్తులో కష్టమవుతుంది. 

లోకేష్ అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ తండ్రిని మించిన నాయకుడిగా ఎదిగితే తప్ప తెలుగుదేశం పార్టీ చరిత్ర కొనసాగదు.

ఎటు చూసుకున్నా పార్టీకి భవిష్యత్తు కాంతివంతంగా కనిపించడం లేదు.

ఈ 2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రైతే కొన్నాళ్లు పార్టీకి ఊపిరొస్తుంది. ఆ తర్వాతైనా మళ్లీ ఇదే సమస్య తప్పదు. ఎన్నో సామ్రాజ్యాలు బలహీనమైన వారసత్వం వల్ల కుప్పకూలిపోయాయి. తెదేపా విషయంలో ఇలాంటి ఆలోచన మొదటి సారి కలుగుతోంది. చంద్రబాబు జైలుకెళ్లడం వల్ల ఏర్పడ్డ తాత్కాలిక స్తబ్దత చాలా ఆందోళనకరంగా ఉంది. స్మశాన నిశ్శబ్దమంత భయంకరంగా ఉంది. 

శ్రీనివాసమూర్తి