‘హోమ్ సిక్’ అంటేకుదరదు- అన్న ఏసీబీ కోర్టు!

371 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల మీద ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును హౌస్ కస్టడీకి అనుమతించాలన్న ఆయన న్యాయవాదుల పిటిషన్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. జెడ్…

371 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల మీద ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును హౌస్ కస్టడీకి అనుమతించాలన్న ఆయన న్యాయవాదుల పిటిషన్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. జెడ్ కేటగిరి భద్రత కలిగి ఉండే చంద్రబాబు నాయుడుకు జైలులో చాలినంత భద్రత లేదు అనే వారి భయాలను కూడా తిరస్కరించింది. ఇల్లు కంటే జైల్లోనే భద్రత ఎక్కువగా ఉంటుందని  ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించింది. 

కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడుకు జైలులో ప్రస్తుతం ఉన్న భద్రతను మరింత పెంచుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన రోజు నుంచి కూడా ఆయనను హౌస్ కస్టడీకి ఇవ్వాలని ఆయన న్యాయవాదులు అంటూనే ఉన్నారు. పార్టీ మొత్తం అదే డిమాండును పదేపదే ప్రతిచోట వినిపిస్తూ ఉంది. అయితే సిఐడి పోలీసు వర్గాలు మాత్రం దానిని వ్యతిరేకిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు తన ఇంట్లో ఉన్నట్లయితే సాక్షులను ప్రభావితం చేయగలరని వారు ఆరోపిస్తూ వచ్చారు. 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా హౌస్ కస్టడీ గురించి మాట్లాడినప్పుడు ‘ఇల్లు కంటే జైలు పదిలం కదా అచ్చెన్నా’ అనే శీర్షికతో గ్రేట్ఆంధ్ర డాట్ కాం ఓ కథనాన్ని కూడా అందించింది కథనంలో పేర్కొన్న విధంగానే ఏసీబీ కోర్టు కూడా ఇవాళ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అచ్చంగా అదే వ్యాఖ్యలు చేశారు ఇంటి కంటే జైలులోనే ఎక్కువ బాధ్యత ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు .అవసరమైతే భద్రత పెంచవచ్చు అని కూడా చెప్పారు. వసతుల విషయంలో ఆయనకు అనుకూలంగా ఇంకేమైనా వసతులు కావలిస్తే గనుక వాటిని ఓ కాగితం మీద లిస్టు రాసి తమకు ఇచ్చినట్లయితే వాటిని కూడా ప్రభుత్వం క్షణాల్లో ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు  సుధాకర్ రెడ్డి చెప్పడం విశేషం.

స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అడ్డగోలుగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. ఆ క్షణం నుంచి కూడా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు తరపు న్యాయవాదులు అందరూ కూడా- ఏ డిమాండ్లను అయితే కోర్టు తిరస్కరిస్తుందో అలాంటి వాటిని మాత్రమే తెరమీదకు తెస్తున్నారు. సాధ్యం కాని వాటిని అడగడం.. నిర్ణయాలు అన్నీ తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని ఆరోపణలు చేయడం ఒక రకమైన బురద చల్లే కార్యక్రమంగా వాళ్ళు అనుసరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.