వైఎస్సార్‌పై బాబు ప్ర‌శంస‌లు…ఆ కిక్కే వేర‌బ్బా!

వైఎస్సార్ బ‌తికినంత కాలం ఆయ‌న‌పై రాజ‌కీయ బుర‌ద‌జ‌ల్ల‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. వైఎస్సార్‌ను ఫ్యాక్ష‌నిస్ట్‌గా, రౌడీగా చిత్రీక‌రించి రాజ‌కీయంగా వ్య‌తిరేక‌త క్రియేట్ చేయాల‌ని చంద్ర‌బాబు ఎన్నెన్నో కుట్ర‌ల‌కు తెర‌లేపారు. అయిన‌ప్ప‌టికీ వైఎస్సార్‌పై ప్ర‌జాద‌ర‌ణ‌ను అడ్డుకోలేక‌పోయారు. 2004,…

వైఎస్సార్ బ‌తికినంత కాలం ఆయ‌న‌పై రాజ‌కీయ బుర‌ద‌జ‌ల్ల‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. వైఎస్సార్‌ను ఫ్యాక్ష‌నిస్ట్‌గా, రౌడీగా చిత్రీక‌రించి రాజ‌కీయంగా వ్య‌తిరేక‌త క్రియేట్ చేయాల‌ని చంద్ర‌బాబు ఎన్నెన్నో కుట్ర‌ల‌కు తెర‌లేపారు. అయిన‌ప్ప‌టికీ వైఎస్సార్‌పై ప్ర‌జాద‌ర‌ణ‌ను అడ్డుకోలేక‌పోయారు. 2004, 2009లో వ‌రుస‌గా వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ విజ‌యాన్ని బాబు నిలువ‌రించ‌లేక‌పోయారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవించి వుంటే టీడీపీ ఏమ‌య్యేదో అని జ‌నాలు చర్చించుక‌నేంత‌గా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆ దివంగ‌త నేత త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విలువ ఆయ‌న బ‌తికిన‌ప్పుడు కంటే, మ‌న మ‌ధ్య భౌతికంగా లేన‌ప్పుడే బాగా తెలిసొస్తోంది. ఎంత‌గా అంటే …రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థి అయిన చంద్ర‌బాబు ప‌దేప‌దే ప్ర‌శంసించేంత‌గా.

‘అమరావతి వివాదాలు – వాస్తవాలు’ పుస్తకావిష్క‌ర‌ణ స‌భ‌లో చంద్ర‌బాబు ఉప‌న్యాసంలో వైఎస్సార్ ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డం విశేషం. అది కూడా పాజిటివ్ కోణంలో.  బాబు ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

‘రాష్ట్రంలో ఏ వ్యక్తి శాశ్వతం కాదు. పనులు శాశ్వతం. మనం చేసిన పాలన వల్ల రాజకీయ లబ్ధి జరిగిందా లేక ప్రజలకు మంచి జరిగిందా అని చూడాలి. నాడు వైఎస్సార్‌ సైబరాబాద్‌ను నిలిపివేయాలనే ఆలోచన చేయలేదు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు టీడీపీ హయాంలో భూములు సేకరించాం. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్ భూమిపూజ చేసి ప్రాజెక్టు పూర్తి చేశారు’ అని చంద్ర‌బాబు గుర్తు చేశారు.

తాను ఏర్పాటు చేసిన అమ‌రావ‌తి రాజ‌ధానిని మాత్రం వైఎస్సార్ కుమారుడు, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కొన‌సాగించ‌క‌పోవ‌డాన్ని చంద్ర‌బాబు త‌ప్పు ప‌ట్టారు. తండ్రి స్ఫూర్తిని పాల‌న‌లో జ‌గ‌న్ క‌న‌బ‌ర‌చ‌లేద‌ని ప‌రోక్షంగా ఆయ‌న విమ‌ర్శించారు. త‌న పాల‌నే రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌ణ‌మంటార‌ని కూడా ఇదే సభ‌లో బాబు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇదిలా వుండ‌గా వైఎస్సార్‌ను అవినీతి పాల‌కుడిగా చూపుతూ వ‌చ్చిన చంద్ర‌బాబు, ఇప్పుడు మాత్రం అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టు ఆయ‌న్ను చూప‌డం విశేషం. అవినీతి పాల‌కుడు కాస్త‌, అభివృద్ధి పాల‌కుడు ఎలా అయ్యాడో చంద్ర‌బాబుకే తెలియాలి. వైఎస్సార్‌ను త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో బాబు పొగ‌డాల్సి వ‌చ్చిందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.