అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ రాజకీయ ఆకలి తీర్చుకుంటోందనే విమర్శలే నిజమవుతున్నాయి. అన్న క్యాంటీన్ల నిర్వహణలో టీడీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆ పార్టీ సీనియర్ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చెప్పకనే చెప్పారు. అన్న క్యాంటీన్లపై టీడీపీ రాష్ట్ర కమిటీ నుంచి వచ్చిన ఆదేశాలో ఏంటో ఆమె బయట పెట్టారు.
తిరుపతిలో ఈ నెల 3వ తేదీ నుంచి అన్న క్యాంటీన్ల పేరుతో టీడీపీ హడావుడి చేస్తోంది. పాపం వారిని ఎవరూ అడ్డుకోవడం లేదు. దీంతో చచ్చినట్టు రోజుకు 50 నుంచి 100 మందికి అన్నదానం చేయాల్సి వస్తోంది. ఇదే వైసీపీ అడ్డుకుని వుంటే ఖర్చు లేకపోవడంతో పాటు ఉచిత ప్రచారం పొంది వుండేవాళ్లు. కానీ వైసీపీ మారిన స్ట్రాటజీతో టీడీపీ ఇరకాటంలో పడింది.
అన్న ఎన్టీఆర్ జీవించిన కాలంలో కుటుంబ సభ్యులెవరూ అన్నం పెట్టకపోయినా, చనిపోయిన తర్వాతైనా స్మరించుకోవడం అభినందనీయమే అనుకున్నారు. అయితే అన్న పేరుతో అన్నదానం మూణ్ణాళ్ల ముచ్చటే అని తేలిపోయింది.
తిరుపతిలో అన్న క్యాంటీన్ వద్ద సుగుణమ్మ నేతృత్వంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తిరుపతి నగరంలో ఈ నెల 3 నుంచి 15వ తేదీ వరకు పేదలకు ఉచిత అన్నదానం చేస్తామన్నారు. అది కూడా నగరంలో ప్రతి రోజూ ఏదో ఒక అన్న క్యాంటీన్ వద్దే అన్నదానం చేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు.
పేదల కోసం అన్నదానం చేయడం లేదని తేలిపోయింది. వైసీపీ కోసమే టీడీపీ అన్న క్యాంటీన్ల ఎపిసోడ్‌కు తెరలేపింది. పేదలకు అన్నం పెడతామంటే వైసీపీ అడ్డుకుంటోందని చూపి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని తప్పితే, నిజంగా ఆకలి తీర్చే ఉద్దేశం లేదని సుగుణమ్మ అమాయకంగా చెప్పింది.
కేవలం వారం లేదా పది రోజులు మాత్రమే అన్నదానం చేయడం ఏంటి? పేదలపై తెగ ప్రేమ కనబరుస్తున్న చంద్రబాబు, టీడీపీ నేతలు.. అప్పుడే వారి ఆకలి తీర్చామని అనుకుంటున్నారా? కేవలం వైసీపీని బద్నాం చేయడానికి చేపట్టిన కార్యక్రమమే… డొక్కశుద్ధి లేదని టీడీపీ నేతల ప్రకటనలే తెలియజేస్తున్నాయి.