మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వారి బెయిల్ పిటిషన్లను ఇవాళ హైకోర్టు కొట్టి వేసింది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నెలల తరబడి ప్రధాన నిందితులు జైల్లో ఉన్నారు. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి మాత్రం బెయిల్‌పై బయట ఉన్నారు. మరో ముగ్గురు నిందితులైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉమామహేశ్వరరెడ్డి, సునీల్ యాదవ్ బెయిల్ కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
కడప కోర్టులో బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో హైకోర్టును ఆశ్రయించారు. తమకు బెయిల్ ఇవ్వాలని నిందితులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ పేరుతో నెలల తరబడి నిందితులను జైల్లో ఉంచడం సాధ్యం కాదని, ఎప్పటికి విచారణ పూర్తి అవుతుందో చెప్పాలని సీబీఐని హైకోర్టు గట్టిగా కోరింది. అయితే త్వరలో కేసుకు సంబంధించి కీలక అరెస్ట్‌లు జరగనున్నాయని, నిందితులను విడుదల చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది.
మరోవైపు వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా తన వాదన వినిపించారు. ఇటీవల దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తన కుమారుడి ఆస్పత్రి ప్రారంభానికి వెళ్లి, పలువురు పోలీస్ అధికారులతో సమావేశమయ్యారని సీబీఐ వాదించింది. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయన్ను కలిశారని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సీబీఐ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
వివేకా హత్య కేసులోని ముగ్గురు నిందితులకు బెయిల్ నిరాకరిస్తూ ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించింది. నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది. దీంతో బెయిల్ కోసం పలు సందర్భాల్లో కింది కోర్టు మొదలుకుని హైకోర్టు వరకూ నిందితుల ప్రయత్నాలన్నీ వరుసగా విఫలమవుతున్నాయి.