నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “అన్‌స్టాపబుల్ సీజన్-2″కు ప్రత్యేక అతిథిగా పవన్‌కల్యాణ్ వెళ్లారు. ఈ షోలో పవన్‌కల్యాణ్ ఆసక్తికర విషయాలు చెప్పారు. అయితే ఈ షోకు పవన్‌ను ఆహ్వానించి బాలయ్య ఇంటర్వ్యూ చేయడం వెనుక టీడీపీ కుట్ర వుందేమో అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. పవన్‌కల్యాణ్ అజ్ఞాన్ని, అసమర్థతను లోకానికి చాటి చెప్పడమే ఈ షో ప్రధాన ఆశయంగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు విడతలుగా పవన్‌కల్యాణ్ ఇంటర్వ్యూ విడుదలైంది. పవన్‌కల్యాణ్‌లోని అజ్ఞానాన్ని, గందరగోళాన్ని బయటికి తీసి, ఇతను రాజకీయాలకు అనర్హుడని నిరూపించడానికే షో చేసినట్టుగా వుంది. భవిష్యత్‌లో ఎప్పుడైనా టీడీపీకి, లోకేశ్ నాయకత్వానికి పవన్‌కల్యాణే థ్రెట్ అని ఆ పార్టీ అధిష్టానం భయపడుతోంది. ఆ రోజు వచ్చే వరకూ ఎదురు చూడకుండా, పవన్‌కల్యాణ్ రాజకీయ అజ్ఞానాన్ని బయట పెట్టడం ద్వారా ముందస్తు సేఫ్ జోన్లో లోకేశ్‌ను ఉంచొచ్చని టీడీపీ ఉద్దేశం.
పవన్‌కల్యాణ్ మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోడానికి ఆయన చెప్పిన విషయాల్నే తీసుకుందాం.
“సరైన స్నేహితుల్లేక ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చేది. పుస్తకాలే స్నేహితులుగా గడిపా. పాఠశాల, కళాశాలకు వెళ్లడం ఇబ్బందిగా అన్పించేది. పరీక్షల ఒత్తిడి నచ్చేది కాదు. ఆ క్రమంలో ఉపాధ్యాయులు నచ్చేవాళ్లు కాదు. సెల్ఫ్ లెర్నింగ్‌లో నడిచాను. స్నేహితులంతా ఉన్నత చదువులు, క్రికెట్లో రాణిస్తున్న వేళ నేను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాను. ఆత్మన్యూనతా భావం వుండేది”
సరైన స్నేహితుల్లేక ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చేదని పవన్ అన్నారు. బడికెళితేనే కదా స్నేహితులు ఏర్పడేది. ఇంత చిన్న లాజిక్‌ని పవన్ ఎలా మరిచిపోయి మాట్లాడారో ఆయనకే తెలియాలి. పుస్తకాలతోనే బాల్యం అంతా గడిచిపోయిందని పవన్ గొప్పలు చెప్పుకున్నారు. ఆయనేం చదువుకున్నారో, బుర్రకు ఏమి ఎక్కించుకున్నారో తెలియదు కానీ, అజ్ఞానం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందనేది వాస్తవం.
ఒకదాని కొకటి పొంతన లేకుండా చెప్పడం పవన్ ప్రత్యేకత. స్నేహితులంతా ఉన్నత చదువులు, క్రికెట్లో రాణిస్తున్న వేళ తాను పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని, దీంతో ఆత్మన్యూనతకు లోనయ్యానని చెప్పడం గమనార్హం. స్నేహితులే లేరని చెప్పిన పెద్ద మనిషి, మళ్లీ వారంత వేర్వేరు రంగాల్లో రాణించారని చెప్పడం ఏంటో కన్ఫ్యూజ్ మాస్టర్ పవన్‌కైనా అర్థమైందో, లేదో మరి!
“17 ఏళ్ల వయసులో మానసికంగా కుంగిపోయాను. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. అన్నయ్య లైసెన్స్ రివాల్వర్ తీసుకుని కాల్చుకుందామని అనుకున్నా”
బడికి, కళాశాలకు వెళ్లి చదువుకోకుండా పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులవుతారు? దాని వల్ల ఒత్తిడికి గురి కాకుండా ఎలా వుంటారు? జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు రావడం తదితర అంశాలు పవన్ బలహీన మనస్తత్వానికి నిదర్శనాలు. సహజంగా పాఠాలు చదువుకుని పరీక్షలు రాస్తుంటాం. కానీ జీవితమనే బడిలో పరీక్షలు ఎదుర్కొని పాఠాలు నేర్చుకుంటాం. ఇదే తేడా.
“అన్‌స్టాపబుల్ సీజన్-2″లో పవన్‌తో బాలయ్య ఇంటర్వ్యూ ప్లాన్ చేయడం రాజకీయ కోణంలో పెద్ద కుట్రగా చెప్పొచ్చు. పవన్‌తో మంచిగా వుంటూనే ఆయనలోని అసమర్థతను, అపారమైన అవివేకాన్ని వెలికి తీయడమే ఆశయంగా మాట్లాడించారంటే కాదనలేని పరిస్థితి. పవన్‌కల్యాణ్ ఎంత తక్కువ మాట్లాడితే ఆయనకు అంత మంచిది. ఎందుకంటే మాట్లాడే కొద్ది జీవితంలోనూ, రాజకీయంలోనూ తన అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నట్టు అవుతోంది.