ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలతో పాటు ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలను గెలిచి తీరాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారు. ముఖ్యంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో విజయం అత్యంత కీలకమని జగన్ ఉద్దేశం. మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అన్ని చోట్ల వైసీపీ తన అభ్యర్థులను చాలా ముందుగానే ప్రకటించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో సైతం వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీ తరపున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నియోజకవర్గం నుంచి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, అలాగే కడప, అనంతపురం, కర్నూలు నియోజకవర్గం నుంచి ఎంవీ రామచంద్రారెడ్డి బరిలో నిలిచారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థులు లేరు. యూటీఎప్, ఎస్టీయూలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. మార్చి 13న ఎన్నికలు జరగనున్నాయి.
అసలే వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టేందుకు ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో ఎలాగైనా గెలవాలని సీఎం జగన్ సంబంధిత జిల్లాల్లోని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ క్రమంలోనే దొంగ ఓట్ల వ్యవహారంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా వుండగా కనీసం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఈ రెండు నెలలైనా వేతనాలను ఆలస్యం కాకుండా వేయాలని సీఎం జగన్‌ను ఎమ్మెల్యేలు, అధికార పార్టీ అభ్యర్థులు వేడుకుంటున్నారు.
ఉద్యోగుల విషయంలో సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నామన్న సంకేతాల్ని ఇప్పుడు పంపాల్సిన తరుణం ఆసన్నమైందని వారి అభిప్రాయం. ఉద్యోగుల వేతనాల విషయమై ఎన్ని విమర్శలొచ్చినా… ఆలస్యంగానే వేస్తున్న పరిస్థితి. ఈ ప్రభావం పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై తప్పక పడుతుందనే ఆందోళన వైసీపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది.