విశాఖపట్నం. మూడు దశాబ్దాలకు పైగా వలస పాలకులకు కేంద్రంగా మారిపోయింది. ఎక్కడ నుంచో నాయకులు దిగుమతి కావడం విశాఖను పాలించడం అలా జరిగిపోతున్నాయి. దీనికి కారణం స్థానిక ప్రజలకు స్థానికత మీద చైతన్యం లేకపోవడం, రాజకీయంగా తమ పట్టుని గట్టిగా నిలుపుకోవాలన్న ఆకాంక్ష లేకపోవడంతో ప్రవాస జిల్లా వాసుల పెత్తనం యధేచ్చగా సాగిపోతోంది.
విశాఖ ఎంపీల జాబితాను చూస్తే నాన్ లోకల్స్ హవా ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. ఇపుడు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక బీజేపీ ఎంపీ గారు విశాఖ గురించి ఎక్కువ తపన పడుతున్నారు. ఆయన చాలా బాగా హడావుడి చేస్తున్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడు అయింది ఉత్తరప్రదేశ్ కోటా నుంచి. కానీ ఆయన చూపు ఇపుడు విశాఖ మీద ఉంది.
విశాఖకు తన మకాం మార్చి విశాఖ రాజకీయాన్ని ఔపాసన పడుతున్న ఆ ఎంపీ గానే జీవీఎల్ నరసింహారావు. ఆయన విశాఖ సమస్యలను తెలుసుకునే పనిలో ఉన్నారు. పెద్దల సభలో ఆయనకూ విశాఖలో ఆరేళ్ల పాటు ఉన్న వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డిలకు మధ్య తాజాగా విశాఖ ప్రయోజనాల మీద చిన్నపాటి వాదనే జరిగింది.
కేంద్ర తాజా బడ్జెట్ లో విశాఖకు తీరని అన్యాయం చేశారని కేంద్ర పాలకుల మీద విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు చేశారు. బెంగుళూరుకు మెట్రో ప్రాజెక్ట్ మంజూరు చేసిన కేంద్రం ఆ చేత్తొ విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించలేకపోయిందని ఆయన గట్టిగానే విమర్శలు చేశారు. ఎపుడో ఆరేడేళ్ల క్రితమే విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ఆలోచన పురుడు పోసుకున్నా ఇంకా ప్రతిపాదన దశను దాటి ముందుకు వెళ్లడంలేదని ఆవేదన చెందారు.
ఇక్కడ ఆయన విమర్శలకు అడ్డం పడింది ఎవరో కాదు జీవీఎల్ నరసింహారావు. ఆయన విజయసాయిరెడ్డితో వాదనకు దిగుతూంటే వైసీపీ ఎంపీకి ఆవేశం వచ్చింది. నీ ఇంటరెస్ట్ ఏంటో నాకు తెలుసు. నన్ను ఎందుకు అడ్డుకుంటావంటూ ఫైర్ అయ్యారు. ఇంతకీ జీవీఎల్ ఇంటరెస్ట్ ఏంటి అన్నది విజయసాయిరెడ్డి చెప్పకపోయినా సెటైరికల్ గా అంటున్నా ఆయన విశాఖ ఎంపీ సీటు మీద కన్నేశారని, 2024 ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేయాలని తహతహలాడుతున్నారని విజయసాయిరెడ్డి చెప్పకనే చెప్పేశారు.
జీవీఎల్ తన పొలిటికల్ ఇంటరెస్ట్ అయిన విశాఖ గురించే విజయసాయిరెడ్డి మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి చెబుతున్నపుడు ఎందుకు అడ్డుకోవడం అన్నదే ఇక్కడ వైసీపీ నేతల వాదన. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అవుతూంటే బీజేపీ ఎంపీ కనీసంగా అడగలేకపోతున్నారు. విశాఖ రైల్వే జోన్ కి నిధులు ఎందుకు కేటాయించరు అని ప్రశ్నించరు, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అటకెక్కించేసినా మాట్లాడకూడదా అని అంటున్నారు. విశాఖకు మేలు చేసే నాలుగు ప్రాజెక్టులను కేంద్రం నుంచి ఒప్పించి తెస్తే ఆయన పొలిటికల్ ఇంటరెస్ట్ కి అర్ధం ఉంటుంది అని అంటున్నారు.
మరి జీవీఎల్ అయితే మెట్రో రైల్ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లలేదని అంటున్నారు. ఆ దిశగా తన ప్రయత్నాలు ఏవో తాను చేస్తే విశాఖకు మేలు చేసినట్లే కదా. పైగా తన ఎంపీ సీటుకు పోటీకి ఎంతో కొంత భరోసా దొరికినట్లే కదా.