కోర్టుల్లో ఏడాదికేడాది పేరుకుపోతున్న పెండింగ్ కేసుల సంఖ్య చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. లోక్ అదాలత్ లు పెట్టినా, మధ్యవర్తిత్వాలు జరిపినా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టినా.. భారత్ లో కేసుల సంఖ్య మాత్రం తగ్గడంలేదు. పైపెచ్చు ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగింది.
భారత్ లోని అన్ని కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య అక్షరాలా 4 కోట్ల 32 లక్షలు. ఫిబ్రవరి 1 నాటికి ఒక్క సుప్రీంకోర్టులోనే పెండింగ్ కేసుల సంఖ్య 69,511గా కేంద్ర న్యాయ శాఖ లెక్క తేల్చింది.
పెండింగ్ లో టాప్ అలహాబాద్ కోర్టు
భారత్ లో కింది స్థాయి కోర్టులు, పై స్థాయి కోర్టులు, సుప్రీంకోర్టు.. ఇలా అన్నిట్లో కోట్ల కేసులు పెండింగ్ లో ఉండటం విశేషం. దేశంలోని 25 హైకోర్టుల్లో మొత్తం 59,87,477 కేసులు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక పెండింగ్ లో రికార్డ్ అలహాబాద్ హైకోర్టుది. అలహాబాద్ హైకోర్టులో మొత్తం 10.3 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సిక్కిం హైకోర్ట్ లో అత్యల్పంగా 171 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
నేషనల్ జ్యూడీషియల్ డేటా గ్రిడ్ లో ఎప్పటికప్పుడు పెండింగ్ కేసుల జాబితా అప్ డేట్ అవుతోంది. దీని ప్రకారం త్వరలోనే దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల సంఖ్య 5కోట్లకు చేరుతుందనే అంచనాలున్నాయి. భారత్ లో సత్వర న్యాయం కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా అవేవీ ఫలించడం లేదనే విషయం దీన్నిబట్టి అర్థమవుతోంది.
చీటికీమాటికీ కోర్టు మెట్లెక్కే ప్రయత్నాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. చర్చలతో పరిష్కారమయ్యే విషయాలు, వ్యక్తిగత గొడవలు, తగాదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, కుటుంబ సమస్యలు, ప్రచారం కోసం పాకులాటలు.. ఇలా ఒకటేంటి.. రకరకాల కేసులు కోర్టుకు రావడంతో రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అందుకే పెండింగ్ కేసుల సంఖ్య 5కోట్ల మార్క్ ని టచ్ చేస్తోంది.