ఫోన్ ట్యాపింగా? పాడా?…మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని!

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి వైసీపీ నుంచి వెళ్లిపోవాల‌ని చాన్నాళ్ల క్రిత‌మే నిర్ణ‌యించుకున్నారు. అయితే కేబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా త‌న‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆయన ఆశించారు. తాను కూడా మంత్రి ప‌ద‌వి రేస్‌లో…

నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి వైసీపీ నుంచి వెళ్లిపోవాల‌ని చాన్నాళ్ల క్రిత‌మే నిర్ణ‌యించుకున్నారు. అయితే కేబినెట్ విస్త‌ర‌ణ‌లో భాగంగా త‌న‌కు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని ఆయన ఆశించారు. తాను కూడా మంత్రి ప‌ద‌వి రేస్‌లో ఉన్నాన‌ని ఆయ‌న బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో వెక్కివెక్కి ఏడ్చారు. కోటంరెడ్డి ఏం చేసినా… ప‌క్కా ప్లాన్‌తో ఉంటార‌ని నెల్లూరులో ఎవ‌రిని అడిగినా చెబుతారు.

తాజాగా సొంత ప్ర‌భుత్వంపై ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్ర‌యోగించారు. కోటంరెడ్డి ఆరోప‌ణ‌ల‌పై వైసీపీ ముఖ్య నేత‌లు కూడా సీరియ‌స్‌గానే స్పందించారు. మాజీ మంత్రి , వైసీపీ రీజ‌న‌ల్ కోఆర్డినేట‌ర్ బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి ఏకంగా కోటంరెడ్డికి స‌వాల్ విసిరారు. అలాగే కోటంరెడ్డి ఆరోప‌ణ‌ల‌ను కొట్టి పారేశారు. ఇవాళ బాలినేని మీడియాతో మాట్లాడుతూ

‘ఫోన్ ట్యాపింగ్ లేదు.. పాడు లేదు. మంత్రి పదవో, స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వలేదనే అక్కసుతోనే శ్రీధర్ రెడ్డి, ఆనం డ్రామాలు ఆడుతున్నారు. అది కాల్ రికార్డ్ మాత్రమే. కాల్ రికార్డ్‌ను ట్యాపింగ్ అంటే ఎలా? కోటంరెడ్డి ఫ్రెండ్ కాల్ రికార్డ్ చేసి బయటికి పంపారు. ట్యాపింగ్ అని నిరూపిస్తే… రాజకీయాల నుంచి తప్పుకుంటా. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ అయినట్టు నిరూపించాలి. వైసీపీలో నాయకులకు కొదవలేదు. ఒకరు పోతే పది మంది తయారవుతారు’ అని బాలినేని అన్నారు.

టీడీపీకి వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, శ్రీధర్ రెడ్డిలు  ఎప్పటి నుంచో టచ్‌లో ఉన్నారన్నారు. పార్టీ నుంచి బ‌య‌టికి వెళ్లేందుకే కావాలనే ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇంటలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు.. శ్రీధర్ రెడ్డితో ఉన్న చనువుతో కాల్ రికార్డుపై ప్రశ్నించారని బాలినేని చెప్ప‌డం గ‌మ‌నార్హం. కోటంరెడ్డి కన్నా సీనియర్లు నెల్లూరులో చాలామంది ఉన్నార‌న్నారు. సీనియ‌ర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి ఏమనుకోవాలని బాలినేని ప్రశ్నించారు.