మంత్రి పదవి పోగొట్టుకున్నప్పటి నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వర్ణనాతీతం. ముఖ్యంగా తన జిల్లాలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొనసాగిస్తూ, తనను తొలగించడాన్ని ఆయన ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీలో ఆయన అశాంతితో రగిలిపోతున్నారు. సీఎం జగన్‌పై ఆయన లోలోపల ఆగ్రహంగా ఉన్నారు. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తన మాట ఏ మాత్రం చెల్లుబాటు కాకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు, పోయిన తర్వాత అన్నట్టుగా బాలినేని పరిస్థితిని అంచనా వేయాల్సి వుంటుంది.
మంత్రి పదవిలో ఉన్నంత కాలం ప్రకాశం జిల్లాలో బాలినేని చక్రం తిప్పారు. ఆ జిల్లాలో బాలినేని చెప్పిందే వేదం. మరిప్పుడు… కనీసం సీఎం రాక సందర్భంలో హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు కూడా పోలీసులు అనుమతించని దుస్థితి. ఈ నేపథ్యంలో కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. చివరికి ఈ పంచాయితీ సీఎం జగన్ వద్దకు వెళ్లింది. బాలినేని అభిప్రాయాన్ని సీఎం గౌరవించారు. ఒంగోలు వరకే పరిమితం కావాలని సీఎం సూచించినట్టు బాలినేని తెలిపారు.
తాజాగా తన ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలినేని కన్నీటి పర్యంతమయ్యారు. వైసీపీలో బాలినేని దుస్థితిని కన్నీళ్లు ప్రతిబింబిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ నేతలే తనను టార్గెట్ చేశారని ఆయన వాపోయారు. వైసీపీని నాశనం చేసేందుకు కొందరు కంకణం కట్టుకున్నారని, వారి గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని, తాను చూడలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
జిల్లాలోని కొందరు వైసీపీ ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలతో సీఎంకు తనపై ఫిర్యాదులు చేయిస్తున్నారని.. అవి ఎవరు చేయిస్తున్నారో అందరికీ తెలుసని బాలినేని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాను ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించిన వ్యక్తులే తనపై ఫిర్యాదులు చేయడం దారుణంగా ఉందన్నారు. బాలినేని ప్రధానంగా తన బావ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని దృష్టిలో పెట్టుకుని ఘాటు ఆరోపణలు చేశారనేది బహిరంగ రహస్యమే. బాలినేని, వైవీ బావాబామ్మర్దులు అయినప్పటికీ, ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.
తనకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లను వైవీ ఉసిగొల్పుతున్నట్టు బాలినేని బలంగా నమ్ముతున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఆమంచి కృష్ణమోహన్, ఇలా అందరితోనూ బాలినేనికి వైరమే. మంత్రి పదవి పోవడం, జగన్ వద్ద పలుకుబడి తగ్గిందనే సమాచారంతో బాలినేనిపై సొంత పార్టీ ముఖ్యులు ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. నిజానికి వైసీపీకి తాను ఎనలేని సేవలు చేశానని బాలినేని చెబుతున్నప్పటికీ, ప్రతిపక్షంలో ఉండగా నలుగురు ఎమ్మెల్యేలను టీడీపీలోకి పంపారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇది ముమ్మాటికీ నిజమని ప్రకాశం జిల్లాలోని వైసీపీ శ్రేణులు కూడా చెప్పే మాట.
కారణాలేవైనా వైసీపీలో బాలినేనికి బ్యాడ్ డేస్ మొదలైనట్టు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సొంత పార్టీ వాళ్లే పొగ పెడుతున్నారు. గతంలో తమను ఇబ్బంది పెట్టాడని, ఇప్పుడు తమ వంతు వచ్చిందనేది వైసీపీ ముఖ్య నాయకుల అభిప్రాయం. ప్రకాశం జిల్లా వైసీపీ బాలినేని, వైవీ వర్గాలుగా విడిపోయింది. ఇది చివరికి ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకుంది.