నాదెండ్ల వెళ్లారు…ఇపుడు నాగబాబు

జనసేన పార్టీ రాజకీయ వ్యూహాలు ఏంటో మెల్లగా తెలుస్తున్నాయి. ఆ పార్టీ పెద్దలు చెప్పకపోయినా వారి కార్యాచరణను బట్టి అర్ధం చేసుకుంటే జనసేన అడుగులు ఎటు వైపో తెలుస్తోంది. జనసేన వచ్చే ఎన్నికల్లో ఉభయ…

జనసేన పార్టీ రాజకీయ వ్యూహాలు ఏంటో మెల్లగా తెలుస్తున్నాయి. ఆ పార్టీ పెద్దలు చెప్పకపోయినా వారి కార్యాచరణను బట్టి అర్ధం చేసుకుంటే జనసేన అడుగులు ఎటు వైపో తెలుస్తోంది. జనసేన వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రా మీద టార్గెట్ చేసిందని తెలుస్తోంది.

ఈ రెండు ప్రాంతాలలో 68 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటినే పొత్తులు ఉన్నా లేకపోయినా దృష్టి పెట్టి ఎక్కువ సీట్లు గెలుచుకునే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. జనసేనకు చెందిన నాయకులు ఉత్తరాంధ్రా జిల్లాలకు ఒకరి తరువాత ఒకరు వస్తున్నారు. పవన్ తరువాత అంతటి వారు అయిన నాదెండ్ల మనోహర్ విశాఖ జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించి వెళ్లారు. ఆయన తాము ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలలోనే పర్యటించారు.

ఇపుడు నాగబాబు వంతు అని అంటున్నారు. ఆయనను జనసేన ప్రధాన కార్యదర్శిగా పవన్ కళ్యాణ్ నియమించారు. ఆ హోదాలో ఆయన హైదరాబాద్ గడప దాటి ఉత్తరాంధ్రాకే నేరుగా వస్తున్నారు. నాగబాబు విశాఖ రూరల్ జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.

అనకాపల్లి ఎలమంచిలిలలో ఈ నెల ఏడవ తేదీన నాగబాబు టూర్ ఉంటుంది. ఈ సందర్భంగా ఎలమంచిలిలో పార్టీ ఆఫీస్ ని ఆయన ప్రారంభించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి, ఎలమంచిలి. చోడవరం నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు జనసేన సన్నాహలు చేసుకుటోంది. అందుకే నాగబాబు రూరల్ జిల్లాలో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు. 

నాదెండ్ల వచ్చి జగన్ మీద విరుచుకుపడ్డారు. ఇపుడు నాగబాబు కూడా విమర్శలు చేస్తారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.