రెండు రాష్ట్రాల సరిహద్దులను కవర్ చేస్తూ ఓ ఇల్లు ఉన్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర, గుజరాత్ బోర్డర్ లో ఆ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు రెండు రాష్ట్రాల ఆధార్ కార్డులు ఉన్నాయి. రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు అలాంటిదే మరో ప్రదేశం ఉంది. ఈసారి రైల్వే స్టేషన్. ఇది కూడా మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దులోనే ఉండడం విశేషం.
ఈ రైల్వే స్టేషన్ పేరు నవపూర్ రైల్వే స్టేషన్. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఉంది. రైల్వే స్టేషన్ లో కొంత భాగం గుజరాత్ కు చెందిన తాపి జిల్లాలో ఉండగా, మిగిలిన భాగం మహారాష్ట్రలోని నండూర్ బార్ జిల్లాలో ఉంది. దేశంలో ఇలా రెండు రాష్ట్రాల్ని విడదీసే స్టేషన్ ఇదొక్కటే.
రాష్ట్ర విభజన సమయంలో అన్నింటినీ విభజించిన ప్రభుత్వం, ఈ రైల్వే స్టేషన్ ను మాత్రం అలానే ఉంచేసింది. రెండు రాష్ట్రాలకు సరిగ్గా మద్యలో ఓ బెంచ్ ను కూడా ఏర్పాటుచేశారు. ఈ బెంచీలో సగం మహారాష్ట్రలో, మిగతా సగం గుజరాజ్ లో ఉంటుందన్నమాట.
అంతేకాదు, స్టేషన్ లో టికెట్ విండో మహారాష్ట్రలో ఉంటే, స్టేషన్ మాస్టర్ కూర్చునే స్థలం గుజరాత్ లో ఉంటుంది. ఇలా ఈ రైల్వే స్టేషన్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. పర్యాటకుల కోసం ఈ రైల్వే స్టేషన్ లో ఓ సెల్ఫీ పాయింట్ కూడా పెట్టారు.
ఈ స్టేషన్ లో ఎనౌన్స్ మెంట్ కూడా 4 భాషల్లో ఉంటుంది. రెండు రాష్ట్రాలకు చెందిన మరాఠీ, గుజరాతీ భాషలతో పాటు హిందీ, ఇంగ్లిష్ లో ప్రకటనలు ఇస్తారు. 800 మీటర్ల పొడవున్న ఈ రైల్వే స్టేషన్ లో 300 మీటర్లు మహారాష్ట్రలో, మిగతా 500 మీటర్లు గుజరాత్ లో ఉంది.