Ugram Review: మూవీ రివ్యూ: ఉగ్రం

చిత్రం: ఉగ్రం రేటింగ్: 2.5/5 తారాగణం: అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, బేబీ ఊహ తదితరులు  కెమెరా: సిద్ధార్థ జె  ఎడిటింగ్: చోటా కె ప్రసాద్ …

చిత్రం: ఉగ్రం
రేటింగ్: 2.5/5
తారాగణం:
అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శరత్ లోహితాశ్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, బేబీ ఊహ తదితరులు 
కెమెరా: సిద్ధార్థ జె 
ఎడిటింగ్: చోటా కె ప్రసాద్ 
సంగీతం: శ్రీచరణ్ పాకాల 
నిర్మాత: సాహు గారపాటి, హరీష్ పెద్ది 
దర్శకత్వం: విజయ్ కనకమేడల
విడుదల తేదీ: 5 మే 2023

అల్లరి నరేష్ ఒకప్పుడు నెంబర్ వన్ కామెడీ హీరో. కానీ తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవడానికి పోయినేడాది “నాంది” పలికి ఇప్పుడు అదే దర్సకుడితో “ఉగ్రం” గా కూడా ముందుకొచ్చాడు. ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది. 

కథ ఫార్మాట్ పాతదే. కానీ ఎంచుకున్న యాంబియన్స్ కొత్తది. శివ (అల్లరి నరేష్) ఒక పోలీస్ ఇన్స్పెక్టర్. మాదకద్రవ్యాలు సేవిస్తూ హాస్టల్లోని ఆడపిల్లల్ని అల్లరిచేసే ఒక ముఠాని చావచితక్కొట్టి, వాళ్లకి దురదగుండాకు రాసి కేసు పెట్టి రిమాండ్ కి పంపుతాడు. కానీ వాళ్లు బయటికొచ్చి ఇన్స్పెక్టర్ లేని సమయంలో ఇంటికొచ్చి అతని భార్యని హరాస్ చేస్తారు. ఆ సంఘటన జరిగాక శివ కుటుంబజీవితంలో పెద్ద మార్పు చోటు చేసుకుంటుంది. దాని పర్యవసానంగా ఒక పెద్ద యాక్సిడెంటు..భార్య, ఐదేళ్ల కూతురు మిస్సవ్వడం, వాళ్లని మిస్ చేసింది ఎవరో తెలియకపోవడం అంతా మిస్టరీగా మారుతుంది. ఆ మిస్టరీని శివ ఎలా చేధిస్తాడు అనేది మిగిలిన కథ. 

ఒకరకంగా ఈ మధ్యనే వచ్చిన అడివిశేష్ “హిట్2” ఈ కోవకు చెందిన కథే. ఇలాంటి కాప్ స్టోరీస్, క్రైం మిస్టరీస్ చాలానే వచ్చాయి. వీటిల్లో కథ ఒక ఎత్తైతే, కథనాన్ని ఎమోషనల్ గా నడపడం మరొక ఎత్తు. పోలీస్ పవర్ ని తెర మీద చూపించేటప్పుడు కేవలం ఫైటింగులో పంచ్ కొట్టినప్పుడు వచ్చే సౌండ్ ఎఫెక్ట్ ఒక్కటే కాదు, డైలాగ్ డెలివెరీ నుంచి, తూకంలో మాట్లాడడం వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఆ విషయంలో మేకర్స్ నుంచి అల్లరి నరేష్ వరకు సరైన సాధన చెయ్యలేదనిపిస్తుంది. సీరియస్ కాప్ గా చేస్తున్నా కూడా అల్లరి నరేష్ ఎప్పటిలాగానే డైలాగ్స్ చెప్పాడు. అంతే కాదు యాక్షన్ తో సరిపోయేదానికి అక్కర్లేని డైలాగ్స్ చాలా చెప్పి కొన్ని ఎపిసోడ్స్ లో ఎమోషన్ ని డౌన్ చేసాడు. ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్ ఫైట్లో రౌడీల్ని కొడుతున్నప్పుడు డైలాగ్స్ అవసరం లేదు. 

ఇక హిజ్డాల ఫైటు కూడా అతిగానే అనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆ ఎపిసోడ్ ని నిలబెట్టాడు సంగీత దర్శకుడు. 

క్లైమాక్స్ ఫైట్ కూడా ఎంతకీ తెగకుండా సాగుతుంది. టైటిల్ జస్టిఫికేషన్ చేయాలన్నట్టుగా అల్లరి నరేష్ తన ఉగ్రావతారాన్ని చూపించేది ఈ ఫైట్ లోనే. 

అలాగే “అసలు హిజ్డా అంటే ఏంటో తెలుసా?” అంటూ డైలాగెత్తుకుని ఏదో చెప్పే ప్రయత్నం చేయడం కూడా ఎమెచ్యూర్ గా, ట్రొలబుల్ గా ఉంది. సంభాషణల్లో డెప్త్ లేదు. ఇప్పుడే అరంగట్రేం చేసిన రచయిత రాసినట్టుగా ఉన్నాయి మాటలు. 

టెక్నికల్ గా ఈ తరహా సినిమాలకు కావల్సిన కెమెరా వర్క్ వగైరాలు బానే ఉన్నాయి. మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. పాటలు మాత్రం వీక్. నిజానికి ఈ టైపు సినిమాల్లో అవి కథనానికి అడ్డం కూడా.

హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. కాకపోతే ఇంటర్వల్ ఫైట్ ఓవరైనట్టు అనిపించింది. కొన్ని చోట్ల బైక్ మీదున్న ఇన్స్పెక్టర్ పరుగెడుతూ పారిపోతున్న క్రిమినల్ ని చూడగానే బైక్ వదిలేసి వెంటపడడం సిల్లీగా అనిపిస్తుంది. ఇలా ప్రతి చిన్నది ఇక్కడ చెప్పడం అవసరమా అంటే అవసరమే. 

విక్రమార్కుడు సినిమాలో కాప్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుంది? డైలాగులు ఎంత పకడ్బందీగా రాసుకున్నారు? సటిలిటీ వదలకుండా ఎలా నడిపారు? ప్రతి ఫైట్ ఎంత మోతాదులో ఉంది? అన్నీ ఎలా ఉండాలో అలా ఉన్నాయి కనుక అది అప్పట్లో ఉత్తమచిత్రం అనిపించుకుంది. ఆ తూకం చాలా అవసరం. అవన్నీ ఇక్కడ లోపించాయి. ఈ రిమార్క్స్ అన్నీ దర్శకుడికే చెందుతాయి. 

నిడివి పరంగా ఎక్కువగా అనిపించింది. రెండున్నర గంటలు కాకుండా పాటల్లాంటివి తీసేసి కుదించి ఉండాల్సింది. 

అల్లరి నరేష్ కాప్ రోల్ కి తగ్గ పర్సనాలిటీలో అయితే ఉన్నాడు స్లిం గా. డిక్షన్ ని కూడా పాత్రకు తగ్గట్టుగా మలచుకుని ఉంటే బాగుండేది. 

హీరోయిన్ మిర్నా మీనన్ ఫొటోజెనిక్ గా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా పలికింది. 

బేబీ ఊహ కూడా క్యూట్ గా బాగా చేసింది. 

శత్రు స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. డాక్టర్ గా ఇంద్రజ కూడా న్యాయం చేసింది. మిగిలిన నటీనటులంతా ఓకే. 

ఈ సినిమా చూస్తున్నంత సేపు అయితే హిట్2, కాకపోతే “యశోద”..రెండూ కాకపోతే ఇంకోటేదో గుర్తొస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప కొత్త సినిమా చూస్తున్నట్టు అనిపించదు. అయినప్పటికీ ఉన్నంతలో చాలా కష్టపడి థ్రిల్లర్ జానర్లో నడిపారు. మనస్ఫూర్తిగా చాలాబాగుంది అని చెప్పలేం, అలా అని దూరంగా ఉండమని రెడ్ లైట్ వేసి చెప్పలేం. క్రైం మిస్టరీలు ఇష్టపడేవాళ్లకి కాలక్షేపమవ్వొచ్చు. కొత్తగా ఏదో ఊహిస్తే మాత్రం నిరాశ తప్పదు. 

బాటం లైన్: ఉగ్ర నరేషుడు