ఓ సినిమాను వాయిదా వేసేముందు భలేగా కవరింగ్ ఇస్తారు మేకర్స్. ప్రేక్షకులకు మరింత థియేట్రికల్ అనుభూతి ఇచ్చేందుకు, గ్రాఫిక్స్ తో మాయ చేసేందుకు ఇంకాస్త సమయం తీసుకుంటున్నాని చెబుతుంటారు. ఈ విషయంలో హను-మాన్ యూనిట్ పీహెచ్ డీ చేసింది. పదే పదే వాయిదా వేయడం, ఏదో ఒక సూక్తి ముక్తావళి వినిపించడం ఈ యూనిట్ కు కామన్ గా మారింది.
ఈ ఏడాది ప్రారంభంలో హను-మాన్ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. అంతలోనే పాన్ ఇండియా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన వెంటనే సినిమాను వాయిదా వేశారు. బెటర్ ఎక్స్ పీరియన్స్ అంటూ ఏదో చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత టీజర్ రిలీజ్ సందర్భంగా విడుదల త్వరలోనే అంటూ ఊరించారు. అంతా మార్చిలో రిలీజ్ అనుకున్నారు. కానీ గ్రాఫిక్ వర్క్ పెండింగ్ లో పడింది. దీంతో మరోసారి వాయిదా వేశారు. నిజానికి అప్పుడు రీజన్ గ్రాఫిక్ వర్క్ కాదు, షూటింగ్ పెండింగ్ లో పడింది. అప్పుడు కూడా ఏదో చెప్పారు.
ఇక ఫైనల్ ఈ నెలలో థియేటర్లలోకి వచ్చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించారు. అంతలోనే ఆ తేదీ నుంచి కూడా తప్పుకున్నారు. ఈసారి కూడా మరో సూక్తి ముస్తావళి. టీజర్ కు అనూహ్య స్పందన రావడంతో గ్రాఫిక్స్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.
ఇంతకీ అసలు మేటర్ ఏంటి..
అసలు మేటర్ ఏంటంటే.. ఈ సినిమాకు ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది. అడ్వాన్సులు అందిపోయాయి. కేవలం థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాదు, నాన్-థియేట్రికల్ కూడా క్లోజ్ అయింది. జీ గ్రూప్ ఈ సినిమా రైట్స్ దక్కించుకుంది. దీంతో మేకర్స్ బిందాస్ గా ఉన్నారు. దీనికి తోడు దర్శకుడు ప్రశాంత్ వర్మ వ్యవహారశైలి కూడా ఈ డిలేకు కారణం.
ప్రశాంత్ ఎప్పుడూ ఒక కథపై, ఒకే ప్రాజెక్టుపై కూర్చోడు. ఓ వైపు హను-మాన్ చేస్తూనే మరోవైపు అన్-స్టాపబుల్ కు పనిచేశాడు. ఇంకోవైపు కథలపై కసరత్తులు చేస్తున్నాడు. దీనికితోడు ప్రాజెక్టుకు మంచి బజ్ రావడంతో, రీషూట్స్ కూడా చేశాడు ఆమధ్య.
వీటన్నింటి వల్ల హను-మాన్ సినిమా ఎప్పటికప్పుడు లేట్ అవుతూ వస్తోంది. పైకి మాత్రం 'థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్', 'అద్భుతమైన గ్రాఫిక్స్', 'జై శ్రీరామ్' అంటూ స్లోగన్స్ వినిపిస్తారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్.