కావాలనే కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి. తాను టికెట్ ఇప్పించిన వారే తనపై ఫిర్యాదు చేస్తున్నారని.. తనకు వైయస్సార్ రాజకీయ భిక్ష పెట్టారని ఎన్ని ఇబ్బందులు ఉన్నా పార్టీలోనే ఉంటానంటూ స్పష్టం చేశారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూడలేకపోతున్నారంటూ వాపోయారు.
ఇవాళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మూడు జిల్లాలు తిరగలేకపోవడం వల్లే కోఆర్టినేటర్ పదవికి రాజీనామా చేశానని.. ఒంగోలులో తనపై ఎటువంటి వ్యతిరేకత లేదని అనవసరంగా తనపై బురద జల్లుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారాలు కూడా చేస్తున్నారని.. ఇవన్ని ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. వివాదాలకు పార్టీ అధిష్టానమే ముగింపు పలకాలన్నారు.
కాగా కొద్దిరోజుల క్రితం రీజినల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో సమావేశం అయ్యారు. సీఎం జగన్ చెప్పిన బాలినేని రాజీనామాను వెనక్కు తీసుకోలేదు. గత కేబినెట్ విస్తరణలో భాగంగా తనను మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచే బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన కంటే జూనియర్ అయిన ఆదిమూలపు సురేశ్ ను కేబినెట్ లో కొనసాగిస్తూ తనను మాత్రం తప్పించడాన్ని ఆయన అవమానంగా భావిస్తున్నారు.
గతంలో వైఎస్ జగన్.. సొంతంగా పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల పాటు మంత్రిగా కొనసాగే అవకాశం ఉన్నా ఆ పదవి సైతం వదులుకున్నా బాలినేనికి జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి రాజకీయ సమీకరణలు అంటూ మంత్రి పదవి నుండి తప్పించిన విషయం తెలిసిందే.