ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి మరోసారి టికెట్ సాధించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాగుంట కుటుంబానికే ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలనేది బాలినేని డిమాండ్. ఇవాళ కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంపీగా మాగుంటకే అవకాశం రావాలని భగవంతున్ని, తమ ముఖ్యమంత్రిని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. మాగుంట సీటు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్టు ఆయన తెలిపారు. మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే ఆర్థికంగా సంపన్నుడైన మాగుంటను పోగొట్టుకోవడం వల్ల పార్టీకి నష్టమనేది బాలినేని వాదన.
మరోవైపు వైవీ సుబ్బారెడ్డిని పోటీ చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వైవీ, బాలినేని బావాబామ్మర్దులైనప్పటికీ, ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వ్యక్తిగత విభేదాలున్నాయి. వైవీని అడ్డుకునే క్రమంలో మాగుంట కోసం బాలినేని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
తన జిల్లాలో వైవీ రాజకీయ పెత్తనాన్ని బాలినేని ఏ మాత్రం సహించరు. అలాంటిది వైవీ ఎంపీ అభ్యర్థి అయితే ఇంకేమైనా వుందా? అనే ప్రశ్న బాలినేని అనుచరుల నుంచి వస్తోంది. ఇందులో భాగంగానే మాగుంట కోసం బాలినేని చివరి ప్రయత్నాల్ని తీవ్రతరం చేసినట్టు తెలిసింది. బాలినేని ప్రయత్నాలకు కొంత సానుకూలత వచ్చినట్టు సమాచారం.