జనసేనాని పవన్‌కల్యాణ్‌తో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. జనసేనలో ఆయన చేరతారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల అభ్యర్థుల మార్పుచేర్పుల్లో భాగంగా గూడూరు ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ మేరుగ మురళీని నియమించారు. దీంతో టికెట్ దక్కని కారణంగా వరప్రసాద్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయన జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కలవడం విశేషం. ఐఏఎస్ అధికారిగా పని చేసిన వరప్రసాద్ మొట్టమొదట పీఆర్పీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. 2009లో ఆయన పీఆర్పీ తరపున తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం కావడంతో ఆయన వైసీపీలో చేరారు.
2014లో తిరుపతి నుంచి వైసీపీ తరపున ఆయన పోటీ చేసి గెలుపొందారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపీ పదవికి రాజీనామాల చేసిన వారిలో వరప్రసాద్ కూడా ఉన్నారు. వరప్రసాద్‌పై తిరుపతి లోక్‌సభ పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు ఫిర్యాదు చేయడంతో ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఆయన్ను గూడూరు రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు.
50 వేలకు పైగా భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థిపై ఆయన గెలుపొందారు. అయితే పార్టీ కార్యకర్తలు, నాయకులతో సఖ్యతగా ఉండరనే ఆరోపణ ఆయనపై వుంది. గూడూరులో ఆయనపై సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి రగిలింది. అందుకే ఆయన్ను తప్పించి, మురళీని ఇన్‌చార్జ్‌గా నియమించారు. దీంతో పవన్‌తో పాత పరిచయాలను దృష్టిలో పెట్టుకుని జనసేనలో టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏమవుతుందో చూడాలి.