ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలపై వైసీపీ ప్రజాప్రతినిధులు రాజకీయ దాడి చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమెకు కౌంటర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలకు ప్రశ్నలు సంధించారు. షర్మిల తెలంగాణకు వెళ్లి ఆడపిల్లంటే ఈడ పిల్లకాదంటూ సామెతలు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆడపిల్ల గురించి సామెతలు చెప్పి, ఇప్పుడు ఏపీకి ఎందుకొచ్చిందో తెలియదన్నారు. వైఎస్సార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీనే కదా అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు తన స్వార్థం కోసం కాంగ్రెస్ చేసిందంతా మంచే అని షర్మిల చెప్పడం తప్పు కదా? అని ఆయన ప్రశ్నించారు.
షర్మిల ఆలోచనా విధానం, ఎవరి కోసం ఆమె పని చేస్తున్నారో అందరికీ తెలుసని ఆయన అన్నారు. ఎవరి మీదో కోపంతో ఇక్కడికి వచ్చి ప్రతాపం చూపాలని ఆమె అనుకుంటున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా గురించి కూడా ఆమె మాట్లాడారన్నారు. విభజన చేసిందెవరిని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీనే కదా ఏపీని విభజించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీనే లేదు, వైఎస్సార్‌తోనే పోయిందని షర్మిలే చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఏ స్వార్థంతో షర్మిల వచ్చారని ఆయన నిలదీశారు.
జనాన్ని ఎక్కడికక్కడికే లెక్క వేసుకోవడం చాలా తప్పు అని ఆయన అన్నారు. మనం మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తుంటారని ఆయన చెప్పారు. ఏపీని విభజన ఎందుకు చేయాల్సి వచ్చిందో షర్మిల సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.