చాలామంది డాక్టర్ అవ్వాలనుకొని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. ఈమధ్య కొరియోగ్రాఫర్లు కూడా హీరోలుగా మారుతున్నారు. నటుడు సుహాస్ కూడా ఇదే బాపతు.
ఈ కలర్ ఫొటో హీరో నిజానికి నటుడు అవుదామని అనుకోలేదంట. కొరియోగ్రాఫర్ అవుదామనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చాడంట. కానీ అతడి కెరీర్ వేరే టర్న్ తీసుకుంది.
“నేను కొరియోగ్రాఫర్ అవుదామని ఇండస్ట్రీకొచ్చాను. చిన్నప్పట్నుంచి డాన్స్ అంటే ఇష్టం. అందులో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. అందుకే ఇండస్ట్రీకి వచ్చాను. అయితే నా డాన్స్ టాలెంట్ చూపించే సందర్భం రాలేదు. సమయం-సందర్భం లేకుండా డాన్స్ చూపిస్తే, వీడు టాలెంట్ చూపిస్తున్నాడని అంటారు. అందుకే ఆగిపోయాను.”
ఇలా తనలో మంచి కొరియోగ్రాఫర్ ఉన్నాడనే విషయాన్ని బయటపెట్టాడు సుహాస్. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ అనే సినిమా చేశాడు ఈ నటుడు. అందులో మాత్రం తన డాన్సింగ్ టాలెంట్ మొత్తం చూపించానంటున్నాడు.
డాన్స్ తో పాటు తనకు పూరి జగన్నాధ్ అంటే ఇష్టం అంటున్నాడు సుహాస్. పూరి తనకు ఆఫర్ ఇస్తే.. కథ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, చిన్నదా-పెద్దదా అని అడగనని, పరుగెత్తుకుంటూ వెళ్లిపోతానని చెబుతున్నాడు. పూరి మాట్లాడే విధానం, వ్యక్తిత్వం అంటే తనకు ప్రాణం అంటున్నాడు.