మెగాస్టార్ చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం జైకొట్టింది. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, సీఎం జగన్ తదితర ప్రముఖులు భీమవరం వెళుతున్నారు. ఈ సందర్భంగా అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది.
దీంతో ఆయన ఇవాళ భీమవరం చేరుకున్నారు. అల్లూరి విగ్రహావిష్కరణలో ప్రధాని, ముఖ్యమంత్రితో పాటు పాల్గొనేందుకు భీమవరం వచ్చిన చిరంజీవికి అడగడుగునా ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. చిరంజీవి జై అంటూ నినాదాలతో భీమవరం వీధుల్ని మార్మోగించారు. కానీ పవన్‌కల్యాణ్‌కు మాత్రం తగిన రీతిలో ఆహ్వానం అందలేదు. తనను ఆహ్వానించారని పవన్ చెబుతున్నప్పటికీ, జనసేన మాత్రం కేంద్ర ప్రభుత్వ వైఖరిపై గుర్రుగా ఉంది.
మిత్రపక్షమైన జనసేనానితో వ్యవహరించే విధానం ఇదేనా? అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. గుడ్డిలో మెల్ల అన్నట్టు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడం కాస్త ఊరట కలిగించే అంశంగా ఆయన అభిమానులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్‌కల్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
నిన్నటి వీడియోలో పవన్‌కల్యాణ్ ఈ విషయాన్ని గుర్తు చేయడం గమనార్హం. తాను పోటీ చేసిన ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని సభను విజయవంతం చేసేందుకు జనసైనికులు పని చేయాలని పవన్ పిలుపునివ్వడం విశేషం.