భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించడం వెనుక బీజేపీ భారీ వ్యూహం రచించిందా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు రావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించడం చర్చకు దారి తీసింది. అంతేకాదు, మిత్రపక్షమైన జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కూడా బీజేపీ పక్కన పెట్టి, అన్నకు ప్రాధాన్యం ఇవ్వడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
ఇందులో నిజానిజాల సంగతేమో గానీ, ఒక బలమైన చర్చకు తెరలేచింది. ఇటీవల కాలంలో పవన్‌కల్యాణ్ తమను కాదని టీడీపీ వైపు చూస్తుండడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకుంది. కుటుంబ పార్టీలు, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేక నినాదంతో జాతీయ స్థాయిలో తాము పోరాటం చేస్తున్నామని, ఇందులో భాగంగానే ఏపీలో టీడీపీ, వైసీపీలకు సమదూరంలో ఉండాలని అనుకుంటున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ జగన్‌పై ద్వేషంతో పవన్‌కల్యాణ్ మరోసారి చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు తమను కూడా అందులో భాగస్వామిని చేయాలనే ప్రయత్నాలను బీజేపీ పసిగట్టింది.
దీంతో పవన్‌ను సైతం దూరం పెట్టేందుకు వెనుకాడకూడదని బీజేపీ గట్టి నిర్ణయం తీసుకుంది. ఏపీలో బలపడేందుకు ప్రజాదరణ కలిగిన నాయకుడి కోసం బీజేపీ వెతుకులాడుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై బీజేపీ కన్ను పడింది. అందుకే ఆయన్ను దగ్గరికి తీసుకుని సీఎం అభ్యర్థిగా ప్రకటించి, ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు ఆ పార్టీ ముఖ్యుల నుంచి వినిపిస్తున్న మాట.
ఇందుకు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను వేదిక చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. అందుకే చిరంజీవిని ప్రత్యేకంగా కిషన్‌రెడ్డి ఆహ్వానించి గౌరవించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్‌లో చంద్రబాబును సీఎంగా చేయడమా లేక అన్న చిరంజీవిని ఆ స్థానంలో కూచోపెట్టడమా? అనేది పవన్‌కల్యాణ్ విచక్షణకే వదిలి పెట్టాలనే పక్కా వ్యూహాన్ని రచించినట్టు బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
ఇటీవల సీఎం అభ్యర్థిగా పవన్‌కల్యాణ్ పేరు ప్రకటించాలని జనసేన నుంచి వచ్చిన డిమాండ్‌ను బీజేపీ మొహమాటం లేకుండా తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీని వెనుక బీజేపీ దూరదృష్టే కారణమని చెబుతున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థిగా చిరంజీవే రంగంలో ఉంటారని, మద్దతు ఇవ్వడమా? లేదా? అనేది పవన్ ఇష్టమని బీజేపీ తేల్చి చెప్పే రోజు త్వరలో రానుంది. తాతకు దగ్గు నేర్పినట్టు… తమకు రాజకీయాలు నేర్పాలని అనుకుంటున్న పవన్‌కల్యాణ్‌కు అదును చూసి చెక్ పెట్టాలని బీజేపీ పకడ్బందీ వ్యూహం రచిస్తున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
అయితే ప్రజారాజ్యం చేదు అనుభవంతో రాజకీయాలకు మెగాస్టార్ చిరంజీవి దండం పెట్టారు. రాజకీయాల ఊసే లేకుండా తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు. అందరివాడిగా ఉండేందుకే చిరంజీవి ప్రస్తుతానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి, అది కాకుంటే జాతీయ స్థాయిలో వెలిగిపోతున్న బీజేపీ నీడలో ఉండేందుకు చిరంజీవికి అభ్యంతరం ఎందుకనే ప్రశ్న వినిపిస్తోంది. ఏది ఏమైనా చిరంజీవిని తమ పార్టీ స్టార్ లీడర్‌గా తెచ్చుకునేందుకు బీజేపీ భారీ ప్లాన్ చేసిందన్నది నిజం.
సొదుం రమణ