సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యానించిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్‌పై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఫైర్ అయ్యారు. తిరుమలలో ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్టాలిన్ కామెంట్స్‌ను భూమన ఖండించారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారో తెలుసుకుందాం.
‘దోమలు, డెంగీ, మలేరియా, కరోనాను మనం వ్యతిరేకించకూడదు. వాటిని సమూలంగా నిర్మూలించాలి. వీటిని ఎలాగైతే చేస్తామో, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కంటే నిర్మూలించడమే అత్యంత ముఖ్యమైంది. సనాతనం అనేది సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. సనాతనం అంటే స్థిరమైనది లేదా మార్చడానికి వీల్లేనిది అని అర్థం’ అని ఉదయనిధి అన్న మాటలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలపై భూమన స్పందిస్తూ… సనాతన ధర్మం మతం కాదన్నారు. అదొక జీవన యానమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే ప్రమాదం వుంటుందని టీటీడీ చైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని కరుణాకర రెడ్డి హితవు చెప్పారు.
అలాగే సనాతన దర్మాప్రచారం విస్తృతంగా జరగాలని, యువతలో హైందవ భక్తి వ్యాప్తి జరగాడానికి కార్యక్రమాలను శ్రీవారి ఆలయం నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్టు టీటీడీ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదివే విద్యార్థులకు భగవద్గీత సారాంశాన్ని 20 పేజీల్లో ముద్రించి కోటి పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు.