తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో గంగుల కుటుంబ సభ్యులకు చెందిన ఏజెన్సీకి ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య తెలంగాణ మంత్రులకు చెందిన సంస్థల్లో ఐటీ, ఈడీ, సీబీఐ తదితర కేంద్ర సంస్థలు వరుస సోదాలు నిర్వహించాయి.
దీంతో రాజకీయంగా తమను భయపెట్టేందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన చేతిలోని దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఎవరూ భయపడొద్దని ఆయన అన్నారు. కొన్ని నెలల క్రితం మంత్రి గంగుల కుటంబ సభ్యులకు చెందిన శ్వేతా గ్రానైట్స్ ఏజెన్సీలో అవకతవకలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. చైనాకు గ్రానైట్స్ ఎగుమతి చేయటంలో అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ నిర్ధారించింది.
7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్‌ను అక్రమంగా తరలించినట్లు ఈడీ తేల్చింది. అలాగే గ్రానైట్స్ ఎగుమతి ద్వారా ఈ ఏజెన్సీస్ ఫెమా నిబంధనల్లో రూ.4.8 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఈడీ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి పన్నుల కింద రూ. 50 కోట్ల మేరకు చెల్లించాల్సింది పెండింగ్‌లో ఉందని, కేవలం రూ. 3కోట్లతో సరిపెట్టారని శ్వేతా ఏజెన్సీపై ఈడీ అభియోగాలు మోపింది. అంతే కాకుండా హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్టు ఈడీ ఆధారాలతో సహా సేకరించి, తాజాగా మంత్రి కుటుంబ సభ్యులకు నోటీసులు పంపింది.
ఎన్నికల సమయంలో ఈడీ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా వివాదంగా మారుతుందా? లేక తుస్సుమని తేలిపోతుందా? అనేది కాలమే తేల్చాల్సి వుంది.