టీటీడీ నూతన అడిషినల్ ఈవో వెంకయ్య చౌదరికి కూటమి నేతల సిఫార్సు లేఖల సవాల్ ఎదురైంది. వచ్చీ రాగానే ఆయన సమర్థతకు ఇది మొదటి పరీక్ష. కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఎవరికి వారు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఫీల్ అవుతున్నారు. ఇది కాస్త శ్రుతిమించుతోందన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా తిరుపతిలో స్థానిక కూటమి నేతలు తిరుమలలో పెత్తనం కోసం తహతహలాడుతున్నారు.
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో సంబంధం లేకుండానే స్థానిక కూటమి నేతలు తమ పేర్లతో లెటర్ హెడ్‌లపై టీటీడీకి సిఫార్సు లేఖలు పంపుతున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పార్టీలో తమ హోదాను అడ్డం పెట్టుకుని, ఈ లేఖల్ని పంపడం గమనార్హం. వీటిలో వేటిని పరిగణలోకి తీసుకోవాలో టీటీడీ ఉన్నతాధికారులకు అర్థం కాని పరిస్థితి.
ఒకరి లెటర్‌కు దర్శనం ఇచ్చి, మరో నాయకుడికి ఇవ్వకపోతే ఎలాంటి ఇబ్బంది వస్తుందో అని టీటీడీ అధికారులు భయపడుతున్నారని తెలిసింది. ప్రస్తుతం కూటమి నేతలకు సంబంధించిన ఐదారుగురి సిఫార్సు లేఖల్ని పరిగణలోకి తీసుకుని దర్శన భాగ్యం కల్పిస్తున్నట్టు సమాచారం.
ఇలా ఒకర్ని చూసి మరొకరు సిఫార్సు లేఖల్ని పంపుతున్నారని సమాచారం. ఇలాంటి లేఖలు రోజుకు వందల్లో వుండడంతో ఏం చేయాలో అర్థం కాక, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లాలని టీటీడీ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారని సమాచారం.
అయితే దర్శనాలు ఇవ్వడంలో కీలక నిర్ణయం వెంకయ్య చౌదరిదే. ఆయన ఎలా వ్యవహరిస్తారో అనే చర్చకు తెరలేచింది. కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరి సిఫార్సు లేఖను పరిగణలోకి తీసుకుంటే చెడ్డపేరు వస్తుందనే భయం లేకపోలేదు. అలాగని తీసుకోకపోతే రాజకీయంగా రచ్చరచ్చ అవుతుందనే ఆందోళన. అందుకే వెంకయ్య చౌదరి సమర్థతకు సిఫార్సు లేఖలు సవాల్ విసురుతున్నాయని చెప్పొచ్చు.
IAS chadivi manchi chestunnaru super