విశాఖ ఎంపీ చరిత్రలో ఎవరికీ రానంత మెజారిటీ బాలయ్య చిన్నల్లుడు శ్రీ భరత్ దక్కించుకుంటున్నారు. ఆయనకు నాలుగు లక్షల పై చిలుకు మెజారిటీ రాబోతోంది. గతంలో ఎంతో మంది ఎంపీలుగా చేశారు. కానీ ఎవరికీ ఇంతటి మెజారిటీ రాలేదు. గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే అనేక ఎన్నికల్లో మెజారిటీలు లక్ష దాటలేదు.
శ్రీ భరత్ 2019లో కేవలం నాలుగు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఈ అయిదేళ్ళలో ఆ ఓటమి నుంచి విజయానికి ఆయన పరుగులు తీసిన క్రమంలో నాలుగు వేల తేడా కాస్తా నాలుగు లక్షలు మెజారిటీగా రూపు దాల్చింది అని అంటున్నారు.
ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూటమి తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరికీ భారీ మెజారిటీలు దక్కాయి. అవే ఎంపీ అభ్యర్ధికి కూడా కలసి ఆయనకు అతి పెద్ద మెజారిటీ రావడానికి కారణంగా చెబుతున్నారు విశాఖ ఓటర్లు అంతా టీడీపీ కూటమిని విశేషంగా ఆదరించారు.
అది ఎంతలా అంటే వైసీపీ అభ్యర్ధులను అందరినీ ఓడించేశారు. విశాఖ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ కూటమి. మొదటి నుంచి టీడీపీకి విశాఖ కంచుకోటగా ఉంది. జనసేన కూడా కూటమిలో ఉండడం, బీజేపీ కూడా జత కట్టడంతో విశాఖ ఓటర్లు ఏకపక్షంగా ఆ వైపునకు మళ్ళారు అని అంటున్నారు.
ఈ విషయాలు అలా ఉంటే అయిదేళ్ళ తరువాత శ్రీ భరత్ తన కోరికను తీర్చుకుంటూ పార్లమెంట్ లో అడుగుపెడుతున్నారు. ఆయన తాత దివంగత ఎంవీవీఎస్ మూర్తి రెండు సార్లు విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన చివరి సారిగా 1999 లో గెలిచిన పాతికేళ్ళ తరువాత టీడీపీని గెలిపించి తాను వారసుడిగా భరత్ విశాఖ నుంచి గెలవడం ఒక విశేషంగా చెప్పుకోవాలని అంటున్నారు.