తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా విశాఖ నార్త్ నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాసరావు ఇక నుంచి మాజీ ఎమ్మెల్యేగా మిగిలారు. ఆయన రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. మంగళవారం ఈ మేరకు స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు దాంతో గంటా మాజీ అయ్యారు.
గంటా తన రాజీనామాను స్పీకర్ ఇచ్చి చాలా కాలం అయింది. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అప్పట్లో రాజీనామా చేశారు. అయితే అది స్పీకర్ ఫార్మెట్ లో లేదు అన్న దాంతో స్వయంగా ఆయనే శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసకు వెళ్ళి మరీ స్పీకర్ ని కలసి తన రాజీనామాకు ఆమోద ముద్ర వేయాలని కోరారు.
అప్పటి నుంచి పెండింగులో ఉన్న గంటా రాజీనామాకు ఎట్టకేలకు మోక్షం కలిగిస్తూ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదం తెలిపారని పేర్కొంటూ ఈ మేరకు ఆయన కార్యాలయం నుండి ప్రకటన ఇచ్చింది.
ఇదిలా ఉంటే మార్చిలో ఏపీలో రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల ముందే గంటా రాజీనామాతో టీడీపీ వైపు ఉన్న ఎమ్మెల్యేలలో ఒక నంబర్ తగ్గినట్లు అయింది. అలాగే వైసీపీ నుంచి టీడీపీలో నలుగురు ఎమ్మెల్యేలు చేరారు. వారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశీఖర రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. వీరి విషయంలో కూడా వైసీపీ అనర్హత వేటు వేయమని ఫిర్యాదు చేసింది.
తొందరలో వీరి విషయంలో కూడా స్పీకర్ చర్యలు తీసుకుంటారు అని తెలుస్తోంది. గంటా విషయం మాత్రం ఇపుడు చర్చనీయాంశం అయింది. ఆ మధ్య దాకా గంటా టీడీపీలో సైలెంట్ గా ఉండడంతో పాటు వైసీపీలోకి వస్తారని ప్రచారం సాగింది. అయితే కొద్ది నెలలుగా ఆయన టీడీపీలో చురుకుగా ఉంటూ వస్తున్నారు.
దాంతో పాటుగా రాజ్యసభ ఎన్నికలు నంబరింగ్ వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఆయన రాజీనామాకు ఓకే చెప్పి బిగ్ షాక్ ఇచ్చారని అంటున్నారు. అలా గంటాకు చెక్ చెబుతూ టీడీపీ ఓటుని ఒకటి తగ్గించినట్లు అయింది అంటున్నారు.