షర్మిల కేరాఫ్ వైఎస్సార్. ఇదే ఆమెకు ఉన్న గుర్తింపు. ఇంకా చెప్పుకుంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ కి సోదరి. ఆమె ఆ విధంగానే రాజకీయంగా ప్రొజెక్ట్ అవుతోంది. ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టారు వైఎస్సార్ టీపీ అని దానికి పేరు. అయితే ఆమె ఆ పార్టీ ద్వారా విజయాలు సాధిస్తే కనుక కచ్చితంగా ఆమెకు అంటూ ఒక గుర్తింపు ఉండేది.
కానీ ఆమె అక్కడ తన పార్టీ చాప చుట్టేసి కాంగ్రెస్ లో విలీనం చేసేశారు. కేవలం మూడేళ్ళు తిరగకుండానే ఆమె పార్టీని నడపలేను అని చెప్పేశారు. ఒక విధంగా చూస్తే ఆమె పాలేరులో పోటీ చేస్తాను అని చెప్పి కూడా చేయలేదు. ఆమె ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ గానే చూడాల్సి ఉంది.
అటువంటి షర్మిల ఏపీకి వచ్చి ఏమీ సాధిస్తారు, ఏమి ఉద్ధరిస్తారు. ఇది అందరిలో కలిగే సందేహం. కానీ వైసీపీ మాత్రమే ఉలికి పడుతోంది. ఆమె కామెంట్స్ కి అతిగా వైసీపీ రియాక్ట్ అవుతోంది. ఆమె కోసం వైసీపీ అన్నట్లుగా కీలక నేయకులను ముందు పెట్టి మరీ విమర్శలు చేయిస్తోంది.
దాంతో షర్మిల మీడియా ద్వారా ప్రచారం అందుకుంటున్నారు. అసలు ఆమె గురించి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మరచిపోయినా లేక సైలెంట్ అయినా ఏమీ ముప్పు రాదు. తప్పు లేదు. ఆమె మానాన ఆమె కామెంట్స్ చేసుకుంటూ వెళ్తారు. కానీ వైసీపీ విషయం తీసుకుంటే అలా కాదు అన్నట్లుగానే ఉంది. ఆమె విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం మంత్రుల నుంచి సీనియర్ నేతల నుంచి అందరికీ అలవాటు అయిపోయింది.
ఆఖరుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అనంతపురం సభలో ఆమె మీద పరోక్షంగా విమర్శలు చేశారు. అసలు అంతలా విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా అన్నదే ప్రశ్న. షర్మిల ఏపీ కాంగ్రెస్ ని ఈ రెండు నెలల వ్యవధిలో ఎలా బతికించగలరు. ఆమెకు ఉన్న ఇమేజ్ ఏమిటి ఇత్యాది ప్రశ్నలు సగటు జనాలలో ఉన్నాయి.
ఆమె స్పీచెస్ కూడా రొడ్డకొట్టుడుగా రొటీన్ గానే ఉన్నాయి. అటువంటిది ఆమె మీద వైసీపీ విమర్శలు చేస్తూండడం వల్లనే ఆమె పాపులర్ అవుతున్నారు. అదే బీజేపీ డౌన్ డౌన్ అని ఆమె అన్నారు. మోడీ మీద విమర్శలు చేశారు. కానీ ఆ పార్టీ నేతలు ఎవరూ కిమ్మననలేదే. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు మీద విమర్శలు చేసినా ఆ పార్టీ వారు రియాక్ట్ కాలేదే.
మరి ఒక్క వైసీపీయే ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతోంది. దీని వల్లనే షర్మిలకు పేరు వస్తోంది. ప్రచారమూ వస్తోంది. ఆ ఇబ్బంది ఏదో వైసీపీకే ఆమె వల్ల ఉన్నట్లుగా ప్రోజెక్ట్ అవుతోంది. మొత్తం మీద చూసుకుంటే షర్మిల విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా తప్పులు చేస్తోందా అన్నది అయితే అందరిలో ఉంది.