కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసిన చింతా మోహన్ విశాఖలో మీడియాతో మంగళవారం మాట్లాడారు. ఆయన ఈ సందర్భంగా చెప్పిన జోస్యం అయితే వింతగా ఉంది అంటున్నారు. ఆయన ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని జోస్యం ఒకటి వదిలారు. కాంగ్రెస్ కి 130 అసెంబ్లీ సీట్లు 20 దాకా ఎంపీ సీట్లు వస్తాయని చింతా అంటున్నారు.
ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అసలు గ్రౌండ్ లోనే లేరు అని చింతా సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రానికి ఏమీ చేయలేదని అందువల్ల ప్రజలు ఆయనను అసలు ఎన్నుకునే చాన్స్ లేదని అన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మూడవ ప్లేస్ కి దిగజారుతుందని చింతా జోస్యంలో చెప్పడం విశేషం. ఏపీలో ప్రజలు అంతా వైసీపీ టీడీపీల పట్ల పూర్తి విరక్తితో ఉన్నారని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ విజయానికి అదే కారణం అవుతుందని ఆయన చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తాము బాగుపడతామని నమ్మకం మీద ఉన్నారని ఆయన చెప్పరు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలు అంతా తిరిగి కాంగ్రెస్ ని గెలిపించాలని చూస్తున్నారు అని చింతా మోహన్ విశ్లేషించారు బీటెక్ చదివిన యువత మద్యం దుకాణాలలో పనిచేస్తోందని, ఇది ఏపీలో నిరుద్యోగం పరిస్థితి అని ఆయన అన్నారు. ఏపీలో దాష్టికాలు పెరిగిపోయాయని అంగన్ వాడీ కార్యకర్తల మీద మగ పోలీసుల దాడులు చూశామని చరిత్రలో ఎప్పుడూ అలా జరగలేదని ఆయన అన్నారు.
ఏపీ ఎటు పోతోందో అన్న భయం అయితే అయిదు కోట్ల మంది ప్రజలకు ఉందని, ఏపీ మళ్లీ మామూలు స్థితికి చేరుకోవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని జనం అనుకుంటున్నారు అని చింతా మోహన్ చెప్పారు.
ఏపీలో కాపులు రిజర్వేషన్లు కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు. అయితే కాపులు రిజర్వేషన్లు ఇచ్చే స్థాయికి ఎదగాలని తాము కోరుకుంటున్నామని ఆయన అన్నారు. కాపులు అంతా కాంగ్రెస్ పార్టీతో నడిస్తేనే మంచిదని, కాపులను బాగా చూసుకున్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని ఆయన అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ మనిషి అని చింతా మోహన్ మరోసారి చెప్పారు. చిరంజీవి కాంగ్రెస్ లో చురుకుగా పని చేయాల్సిన సమయం ఇదే అన్నారు. ఆయనకు ఇదే విషయం చెప్పానని చింతా మోహం అంటున్నారు. ఏపీలో రాజకీయ పరివర్తన మొదలైందని కాంగ్రెస్ ని గెలిపించాలన్న పట్టుదల ప్రజలలో ఉందని చింతా అంటున్నారు.
ఆయన చెప్పిన జోస్యం ప్రకారం చూస్తే ఏపీలో కాంగ్రెస్ విన్నర్, టీడీపీ జనసేన కూటమి రన్నర్, అధికార వైసీపీకి మూడవ ప్లేస్ గా ఉంది. ఈ జోస్యం మీద అంతా ఆసక్తిగా అయితే మాట్లాడుకుంటున్నారు. చింతా మోహన్ చెప్పినట్లుగా కాంగ్రెస్ కి కేవలం రెండు నెలల వ్యవధిలో అధికారంలోకి వచ్చేటంత పరిస్థితి ఉందా అంటే చింతా మోహన్ కి పార్టీ మీద ఉన్న అభిమానం అది అనే చెప్పుకొస్తున్నారు.