అప్పుడెపుడో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ వాడారు. బీజేపీ ప్రత్యేక హోదాను ఇవ్వకుండా పాచిపోయిన లడ్డూల లాంటి ప్యాకేజ్ ని ఇచ్చిందని. అది బాగా పాపులర్ డైలాగ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఏపీ రాజకీయాల్లో కూడా పాచిపోయిన విమర్శలే ఏ వైపు చూసినా కనిపిస్తున్నాయి.
అధికార వైసీపీ మీద టీడీపీ ఏ రకమైన విమర్శలు చేస్తోందో అన్ని పార్టీలు దాదాపుగా అవే విమర్శలు చేస్తూ వస్తున్నాయి. అవి విని విని జనాలకు బోర్ కొడుతున్నాయి. పాచిపోయిన విమర్శల వల్ల జనాలు కూడా ఆలోచించుకునేందుకు వీలు ఉండడంలేదు కనీసం ఆ వైపు కూడా చూసేందుకు కూడా ఆకర్షణ ఉండడంలేదు.
రెడ్డొచ్చె మొదలెట్టు అని ఒక సామెత మాదిరిగా ఇపుడు పాత గ్రాండ్ ఓల్డెస్ట్ పార్టీ కాంగ్రెస్ లోకి షర్మిల వచ్చారు. ఆమెను ఎకాఎకీన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశారు అంటే ఇలా సభ్యత్వం ఇచ్చి అలా అందలం ఎక్కించారు అన్న మాట. దానికి గానూ ఆమెకు ఉన్న అర్హత ఆమె వైఎస్సార్ కుమార్తె కావడమే అని విమర్శలు ఉన్నాయి.
ఆమె వైఎస్సార్ బిడ్డగా జనంలోకి వెళ్తే కనీసం తమ మాటలు ఎన్నో కొన్ని జనాలు వింటారు అన్నది కాంగ్రెస్ పార్టీ ఆశ కావచ్చు. కానీ ఆ చెప్పే వారు కూడా ఆసక్తిగా చెప్పాలి కదా. షర్మిల విషయమే తీసుకుంటే పాడిన పాటనే పాడుతున్నారు. ఆమె పీసీసీ చీఫ్ గా ప్రమాణం చేసిన రోజున ఏమి చెప్పారో అదే మాటను మళ్లీ మళ్లీ ప్రతీ చోటా చెబుతున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా లేదు అంటున్నారు. అభివృద్ధి లేదు అంటున్నారు. పోలవరం అవలేదు అంటున్నారు. ఈ మాటలు అన్నీ గత పదేళ్ళుగా అందరూ అంటున్నవే జనాలు వింటున్నావే. ఇందులో ప్రత్యేక హోదా గురించి జనాలు మరచిపోయారు అనడమే బెటర్. ఆ మాట అంటే ఏపీ ప్రజలను చూస్తూ తాటాకులు కడుతున్నారా అన్న బాధ ఆవేదన కూడా వారిలో కలుగుతోంది.
అందుకే పాచిపోయిన ఆరోపణలు చేస్తే జనాలు కూడా అట్రాక్ట్ కావడంలేదు. ప్రత్యేక హోదా కధ ఏమిటో జనాలకు బాగా తెలుసు. కేంద్ర ప్రభుత్వాల నిర్వాకమూ తెలుసు. అలాగే పోలవరం రాజధాని విషయంలో కూడా జనాలకు జరిగినవి జరుగుతున్నవీ అన్నీ తెలుసు. మరి వారికి అన్నీ పాతవే. కానీ షర్మిలకు పీసీసీ చీఫ్ హోదా కొత్తది. కాంగ్రెస్ పార్టీకి ఆమె కొత్త. అలా ఆమె కొత్తగా వచ్చి పాత మాటలు మాట్లాడుతూంటేనే హస్తం పార్టీ గురించి జనాలు అసలు ఏమీ ఆలోచించలేని పరిస్థితి వస్తోంది అంటున్నారు.
రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా మీద పెడతారు అని శ్రీకాకుళం జిల్లా పర్యటనలో షర్మిల చెబుతున్నారు. అయినా జనాలు నమ్ముతారా. ఆయన ప్రధాని కావడం అంటే ముందు సొంతంగా కాంగ్రెస్ గెలవాలి. ఆ పరిస్థితి అయితే లేదు. ఇండియా కూటమి గెలవాలి. అందులో ఉన్న పార్టీలు ఏపీ ఒక్క దానికే ప్రత్యేక హోదా అంటే జరగనిస్తాయా. ఇవన్నీ ప్రశ్నలు.
అసలు నిక్షేపంగా అధికారం చేతిలో ఉన్నపుడే ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు విభజన చట్టంలో పెట్టలేదు, ఏపీ రాజధాని తామే కేంద్ర నిధులతో కట్టించి ఇస్తామని ఎందుకు చట్టంలో చేర్చలేదు. పోలవరం విషయంలో వ్యయం ఎంత అయినా భరిస్తామని ఎందుకు చట్టంలో రాయలేదు. ఇలా కాంగ్రెస్ ఎన్నో తప్పులు చేసి అడ్డగోలుగా విభజన చేసింది. ఇపుడు తగుదునమ్మా అని ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల చెబుతున్నారు.
అసలు ఏపీకి గాయం చేయడం ఎందుకు మందు పూస్తామని హామీలు ఎందుకు అన్నదే కదా జనాల ప్రశ్న. ఏపీ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు మరోటి లేదు ఇలాంటి మాటలతో అయితే షర్మిల జనాలను ఆకట్టుకోలేరు అంటున్నారు. ఆమె ప్రసంగాలలో కొత్తదనం లేకపోతే విమర్శలలో పదును లేకపోతే పాత కాంగ్రెస్ పార్టీ ఇంకా పాతబడి అలాగే ఉంటుంది అన్నది అని అంతా అంటున్న మాట.