జనసేనాని పవన్‌కల్యాణ్‌పై బీజేపీ ఆశలు సజీవంగా ఉన్నాయి. వాస్తవాల కంటే ఊహలు మధురంగా వుంటాయని అంటుంటారు. పవన్ తమతో కొనసాగుతారనే ఊహపై బీజేపీ రాజకీయ మేడలు కట్టుకుంటోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యలు బీజేపీ ఆశల్ని ప్రతిబింబిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో పవన్ తమతో కలిసి వస్తారని, ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తామని పురంధేశ్వరి నమ్ముతున్నట్టున్నారు.
గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో పవన్‌తో కలిసి సీట్లు సర్దుబాటు చేసుకుంటామన్నారు. గతంలో జనసేనతో కుదిరిన పొత్తు ఇంకా కొనసాగుతోందని ఆమె విశ్వసిస్తున్నారని అనుకోవాలి. ఇటు చంద్రబాబు లవ్ ప్రపోజల్, అటు దేశ వ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై పవన్ ఇంకా స్పష్టతకు రాలేకున్నారు. తాను ఆశిస్తున్నట్టు జగన్‌ను అణచివేసేందుకు కేంద్ర బీజేపీ నాయకత్వం సిద్ధంగా లేకపోవడంతో పవన్ ఆగ్రహంగా ఉన్నారు.
తన ఎజెండా ప్రకారం బీజేపీ నడుచుకోదని పవన్ క్లారిటీతో ఉన్నారు. అలాగని బీజేపీని విడిచి, టీడీపీతో వెళ్లాలంటే భవిష్యత్‌లో ఏమవుతుందో అనే భయం ఆయన్ని వెంటాడుతోంది. బీజేపీ పెద్దల చల్లని చూపు కోసం తాను ప్రేమించే చంద్రబాబు వెంపర్లాడుతుండడం కూడా ఆయన్ని అయోమయంలో పడేసింది. అలాగని బీజేపీతో తెగదెంపులు చేసుకునే ధైర్యం పవన్‌కు లేదు. భవిష్యత్‌లో ఆచితూచి అడుగులు వేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టే కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో పవన్ విషయంలో పురంధేశ్వరి సానుకూల ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. ఇంత కాలం బీజేపీ నేతలు జనసేనతో మాత్రమే పొత్తు వుంటుందని చెబుతూ వస్తున్నారు. తాజాగా సీట్ల సర్దుబాటు గురించి ఆమె మాట్లాడ్డం పొత్తుపై డెవలప్‌మెంట్‌గా చెప్పుకోవచ్చు. మాటల వరకే పరిమితం కాకుండా, సీట్ల సర్దుబాటుపై చేతల వరకూ వస్తే మాత్రం పెద్ద అచీవ్‌మెంట్‌గా అనుకోవచ్చు. బహుశా పురంధేశ్వరి చొరవ చూపే అవకాశాలున్నాయి.