మతాల కుంపటి రాజేయడానికి కుట్ర!

వినాయకచవితి పేరుతో రాష్ట్రంలో వీలైనంత అగ్గి రాజేయడానికి.. భారతీయ జనతాపార్టీ కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. చవితి మండపాలకు అనుమతులు పేరుతో.. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కూడా వారు సంకల్పించినట్టు కనిపిస్తోంది. ఏ నిబంధనలూ పాటించం,…

వినాయకచవితి పేరుతో రాష్ట్రంలో వీలైనంత అగ్గి రాజేయడానికి.. భారతీయ జనతాపార్టీ కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. చవితి మండపాలకు అనుమతులు పేరుతో.. ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కూడా వారు సంకల్పించినట్టు కనిపిస్తోంది. ఏ నిబంధనలూ పాటించం, ఏ అనుమతునలూ తీసుకోం.. ఏం చేస్తారో చేసుకోండి, అరెస్టు చేస్తారా చేయండి అనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలు.. రాష్ట్రంలో శాంతి భద్రతలను దిగజార్చడానికి చేసే ప్రయత్నాలే మినహా మరొక్కటి కాదు. అరెస్టులో, తమ మీద పోలీసు చర్యలో జరిగితే.. తద్వారా కొంత పాపులారిటీ సంపాదించుకోవచ్చునని సోము వీర్రాజు కక్కుర్తి పడుతున్నట్లుగా కనిపిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతపరమైన వివాదాలు రేగడానికి, ఘర్షణలు తలెత్తడానికి మామూలు పరిస్థితుల్లో ఎలాంటి అవకాశమూ లేదు. మతపరంగా రాష్ట్రంలో సౌహార్దపూరిత వాతావరణమే ఉంటుంది. కానీ.. అలాంటి వాతావరణం కమలనాయకులకు కంటగింపుగా ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రజలు మతపరమైన స్నేహబాంధవ్యాలతో మెలగుతూ ఉంటే.. తమ పార్టీకి ఎప్పటికీ ఠికానా ఉండదని వారికి భయం. 

అసలే.. విభజన తర్వాత చేసిన, చేస్తున్న కుట్రపూరిత ద్రోహానికి బిజెపి అంటే రాష్ట్రప్రజల్లో అపరిమితమైన ద్వేషం ఉన్నదనే సంగతి వారికి తెలుసు. ఆ ద్వేషాన్ని ప్రజలు మరచిపోయి.. ప్రత్యేకంగా తమ మీద అభిమానాన్ని పెంచుకోవాలంటే.. మతపరమైన అంశాలను రేపడమే మార్గం అని వారు కుట్రపూరితంగా ఆలోచిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.

వినాయకచవితి మండపాలకు వివిధ ప్రభుత్వ శాఖలనుంచి అనుమతులు తీసుకోవాలనేది ఇవాళ జగన్ సర్కారు కొత్తగా పెట్టిన నిబంధన కాదు. పురాతన కాలంనుంచి ఉన్నదే. ఏ జాగ్రత్తలూ తీసుకోకుండా మండపాలు పెట్టేస్తే.. వాటి వలన ఏదైనా ప్రమాదం జరిగితే.. పోయే ప్రాణాలకు ఎవరైనా ప్రభుత్వాన్ని నిందిస్తారా? నిబంధనలు లేకుండా మండపాలు పెట్టేస్తాం అని ఓవరాక్షన్ చేస్తున్న సోము వీర్రాజును నిందిస్తారా? సరైన భద్రత ఏర్పాట్లు లేని మండపాలకు అనుమతి ఎలా ఇచ్చారంటూ ప్రభుత్వాన్నే నిందిస్తారు. 

తాము ప్రభుత్వంలోకి ఈ జన్మలో వచ్చే అవకాశం లేదు గనుక.. ప్రభుత్వ నిర్ణయాలు ఇలా ఉండకూడదని, నిబంధనలు తగదని.. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడవచ్చునని సోము వీర్రాజు డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. అందుకే చవితి మండపాలను అడ్డుగా పెట్టుకుని.. ఆయన రెచ్చిపోతున్నారు. 

గణేశ్ ఉత్సవ కమిటీలను అడ్డుకుంటే తనకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు. రాష్ట్రప్రభుత్వం హిందువుల పండుగల పట్ల కట్రపూరితంగా వ్యవహరిస్తోందని అంటూ నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. నిబంధనలే ఉండవద్దనే ఇలాంటి అవకాశవాద రాజకీయ నాయకుల కుత్సితాలను ప్రజలు అర్థం గమనిస్తూనే ఉంటారు. వారికి సరైన సమయంలో బుద్ధి చెప్తారు.