మోకాలికి బోడి గుండు కి ముడి పెట్టడం అంటే ఏమిటో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నిరూపించదలుచుకుంటోంది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే… ఆ వ్యవహారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో ఒక అక్రమ సంబంధాన్ని ముడిపెట్టేసి నిందలు వేయడానికి ఎగబడుతోంది. తాజా పరిణామాలను గమనిస్తే… ఢిల్లీలో మద్యం కుంభకోణం చోటు చేసుకుంటే.. దానికి వైయస్ జగన్ తోనూ, ఎంపీ విజయసాయిరెడ్డి తోనూ ముడి పెట్టడానికి తెలుగుదేశం కుటిల ప్రయత్నాలు చేస్తుండడమే తమాషా. ఇంతకు ఢిల్లీ మద్యం కుంభకోణంతో ఏరకంగా వైఎస్ఆర్సిపి నాయకులకు ముడి పెడుతున్నారు వింటే ఎవరైనా నవ్వి పోతారు.
తెలుగుదేశం పార్టీ తరఫున అంతగా పాపులారిటీ లేని అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తాజాగా తెరమీదకి వచ్చారు. ఈ సందర్భంలో నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి మీద ప్రధానంగా బురద చల్లదలుచుకుంటున్నారు కనుక నెల్లూరు జిల్లాకే చెందిన మరొక నాయకుడిని తెలుగుదేశం పార్టీ తెరమీదకు తెచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆయన తను అప్పగించిన స్క్రిప్టును అప్పజెప్పినట్టుగా తలా తోకా లేకుండా… బోడి గుండు ని మోకాలిని ముడి పెట్టడానికి తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న ఒక పేరును ప్రస్తావించి, ఆ పేరు గల వ్యక్తి విజయసాయిరెడ్డి అల్లుడికి చట్టం అవుతారని… అందువలన ఈ కుంభకోణంతో విజయసాయిరెడ్డికి కూడా సంబంధం ఉన్నట్లే అని లింకులు కలుపుతున్నారు. ఒక కులంలో ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ముడి పెట్టదలుచుకుంటే కొన్ని వందల మందితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. వారందరూ చేసే ప్రతి వ్యాపారంతోను ఆ నాయకుడికి ప్రత్యక్ష ప్రమేయం ఉంటుందని అనుకుంటే అది పొరపాటు. అన్యాయం కూడా. ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలో కూడా తెలుగుదేశం ఆరోపణలు ఇలాగే కనిపిస్తున్నాయి.
ఇంతకంటే దిగజారి తెలుగుదేశం నాయకులు మరో ప్రయత్నం కూడా చేస్తున్నారు. రకరకాల చెట్లు తిప్పి.. ఫలానా వ్యక్తులతో ఫలానా వ్యక్తులకు సంబంధాలు ఉన్నాయి.. ఆ పలానా వారికి ఇంకొక ఫలానా వారితో చిన్న లింకు ఉన్నది.. ఇలా అనేక వరసలు కలిపి.. చివరకు జగన్ భార్య భారతీయ రెడ్డికి కూడా ఢిల్లీ మద్యం కుంభకోణంతో ప్రమేయం ఉండే అవకాశం ఉన్నదంటూ వక్ర పూరిత ప్రచారాలు చేస్తున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం అనేది ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా హాట్ హాట్ గా ఉన్నది గనుక.. దానితో ముడిపెట్టేసి.. బురద చల్లేస్తే ఒక పనైపోతుంది అని తెలుగుదేశం భావించినట్లుగా కనిపిస్తోంది.
దారుణం ఏంటంటే… సోషల్ మీడియాలో అడ్డగోలుగా మాట్లాడుతూ, బండబూతులు తిడుతూ, చెలరేగిపోయే దుర్మార్గులను శిక్షించడానికి.. వారికి అడ్డుకట్ట వేయడానికి.. నిర్దిష్టమైన చట్టాలు ఉన్నాయి! ఆ చట్టాల ప్రకారంగా పోలీసులు పనిచేస్తూ ఉంటారు.
కానీ బూతులు, తిట్లు, అసభ్యత లేకుండానే అంతకుమించి వ్యక్తిత్వ హననం చేయడానికి దిగజారే ఇలాంటి నాయకులను కట్టడి చేయడానికి ఏ చట్టాలూ లేవు. అర్థంపర్థం లేని లింకులను ముడి పెడుతూ దేశంలో ఎక్కడ ఏ నేరం జరిగినా.. తమ రాజకీయ ప్రత్యర్థులకు దానితో ముడి పెట్టాలని ఆరాటపడే ఇలాంటి కుహనా మేధావులను ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలి.