జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ భయపడుతున్నట్టే కనిపిస్తోంది. ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్నా… ఆయన్ను ఏదో వెంటాడుతోందన్న భావన లేకపోలేదు. రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్‌కు ఆసక్తి ఎక్కువే. 2009లో ఎన్నికల ప్రచారమే ఇందుకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు తర్వాత టీడీపీ వారసుడెవరనే ప్రశ్న… సమాధానం కరువైంది.
చంద్రబాబు తనయుడు లోకేశ్ పేరు వినిపిస్తున్నప్పటికీ, అంత సమర్థవంతమైన నాయకుడు కాదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకురావాలని పార్టీ శ్రేణుల డిమాండ్. ఇందుకు చంద్రబాబు, బాలకృష్ణ ససేమిరా అంటున్నారు. ఎందుకంటే లోకేశ్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతారనే భయం. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ను కేంద్రహోంమంత్రి అమిత్‌షా కలవడం రాజకీయ దుమారానికి తెరలేపింది. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తారేమో అన్న ప్రచారం జరుగుతుంటే, లోకేశ్ గురించి పట్టించుకునే వారే లేరు.
దీంతో టీడీపీ వర్గాలు వ్యూహాత్మకంగా లోకేశ్ పేరును తెరపైకి తేవడం వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. అమిత్‌షాతో లోకేశ్ రహస్యంగా భేటీ అయ్యారని, టీడీపీ-బీజేపీ పొత్తు ఖాయమైందనే ప్రచారానికి తెరలేచింది. ఇదంతా లోకేశ్ పరపతి పెంచడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్‌పై సాగుతున్న ప్రచారానికి ముగింపు పలికే ఎత్తుగడ దాగి ఉందని అంటున్నారు. అమిత్‌షాతో లోకేశ్ రహస్యంగా భేటీ కావాల్సిన అవసరం ఏంటి? దాన్ని దాచి పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది?
అమిత్‌షాతో లోకేశ్ భేటీ అయ్యాడనే ప్రచారం ద్వారా… మా నాయకుడి స్థాయి తక్కువేం కాదని చెప్పుకునేందుకే అని జూనియర్ అభిమానులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోకేశ్‌తో రహస్యంగా భేటీ అయి తన స్థాయిని అమిత్‌షా తగ్గించుకుంటారా? అని టీడీపీ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. లోకేశ్‌తో అమిత్‌షా భేటీపై సాగుతున్న ప్రచారాన్ని బీజేపీ నేతలు అసలు పట్టించుకోవడం లేదు. త్వరలో ఎన్డీఏలో టీడీపీ చేరుతుందని అనుకూల మీడియా ప్రచారం… ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను బెదిరించే వ్యూహం కనిపిస్తోందని అంటున్నారు.
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌ను అమిత్‌షా పిలిపించుకుని మాట్లాడ్డాన్ని టీడీపీ జీర్ణించుకోలేకుంది. చంద్రబాబు తర్వాత జూనియర్ ఎన్టీఆరే వారసుడనే సంకేతాల్ని అమిత్‌షా ఇవ్వడం ఏంటనే ప్రశ్న టీడీపీ నుంచి వస్తోంది. అలాగని లోకేశ్ సమర్థుడైన నాయకుడా? అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్‌ను తీవ్రంగా విభేదించే లోకేశ్… వ్యూహాత్మకంగా సోషల్ మీడియాలో బద్నాం చేసేందుకు తనపై పాజిటివ్ ప్రచారానికి తెరలేపారనే చర్చ జరుగుతోంది.