ఇవ్వాళ ఓ దినపత్రికలో ఓ వార్త వచ్చింది. విశాఖలో వసూల్ రాజా ఎవరో విచ్చలవిడిగా డీల్స్ చేసేస్తున్నారు. ప్రభుత్వంలో తనకున్న పలుకుబడి వాడుతూ ఆ ఐఎఎస్ డబ్బులు చేసుకుంటున్నారు అంటూ. ఇది ఎంత వరకు నిజం అన్నది పక్కన పెడితే గత కొన్ని దశాబ్దాలుగా విశాఖను ఎవరు పట్టి పీడిస్తున్నారో? ఏ వర్గం విశాఖలో విపరీతంగా భూములు ఆక్రమించి, గెడ్డలు ఆక్రమించి దందాలు చేస్తూ వచ్చిందో సాధారణ జనాలకు తెలియకపోయినా, ఆ పనిలోనే వుండే వాళ్లకు బాగా తెలుసు. ఇంతకీ ఆ పత్రికలో వచ్చిన వార్త ఎలా సాగిందో ఓసారి చూద్దాం.
‘’…అది… విశాఖలో ఎండాడలోని ఖరీదైన, అత్యంత వివాదాస్పదమైన భూమి. ఓ సామాజిక ప్రయోజనం కోసం నాటి సర్కారు ఓ ప్రైవేటు వ్యక్తికి మార్కెట్ ధరకు భూమి కేటాయించింది. భూ కేటాయింపు మార్గదర్శకాలు, ఇతర ఆంక్షలు అమలు కాకపోవడంతో అది వివాదంలో పడింది. కొన్నేళ్లుగా అటు కోర్టులు, ఇటు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వ్యవహారం సాగుతోంది. ఇంతలో వైసీపీ నేత ఒకరు ఆ భూమిపై కన్నేశారు. ఇందుకు వసూల్ రాజాను సంప్రదించారు. వ్యవస్థలు, అధికార యంత్రాంగాన్ని సైతం కనుసైగతో శాసించగల స్థాయి ఉన్న ఆయన ఈ పని చేసి పెట్టేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఆ డీల్ విలువ 30 కోట్లు..! అంటే.. 250 కోట్ల విలువైన ఆ భూమిలో వసూల్ రాజా వాటా 30 కోట్లు. ఇది కేవలం ఆయన మాట సాయం విలువ..!…’’
ఇదీ వార్త. బాగానే వుంది. ఇక్కడ కొన్ని జవాబు తెలియాల్సిన ప్రశ్నలు వున్నాయి.
1. గత ప్రభుత్వం ఏ విధంగా 250 కోట్ల విలువైన భూమిని ఓ వ్యక్తికి కేటాయించేసింది?
2. సామాజిక ప్రయోజనం కోసం ఓ ప్రయివేటు వ్యక్తికి ప్రభుత్వ భూమిని అది కూడా 250 కోట్ల విలువైన భూమి కేటాయించేస్తారా?
3. ఇదే పని జగన్ ప్రభుత్వం చేసి వుంటే ఈ పాటికి దీని మీద ఎన్ని వార్తలు వండి వార్చేవారు?
4. ఇంతకీ 250 కోట్ల విలువైన భూమిని సామాజిక ప్రయోజనం కోసం గత ప్రభుత్వం నుంచి పొందిన ఆ వ్యక్తి ఎవరు? అతనిది ఏ పార్టీ? అతనిది ఏ సామాజిక వర్గం?
5. ఇవన్నీ మాత్రం తెరవెనక వుంచేసారు. అప్పట్లో అంటే గత ప్రభుత్వ హయాంలో విశాఖలో ఇలాంటివి చాలా జరిగాయి అని గుసగుసలు వున్నాయి. అవన్నీ ఒక్కటయినా ఇలా బయటకు ఎందుకు రాలేదు?
ఎప్పుడూ రాజకీయ వర్గాల్లో వ్యవహారం ఎలా వుంటుందీ అంటే…వీళ్లకు అవకాశం వున్నపుడు వీళ్లు లాగాల్సినంత లాగేస్తారు. అవతలివాడికి అవకాశం వచ్చినపుడు వాడు లాగడం ప్రారంభిస్తాడు. ఈ ఆను పానులు వాళ్లకే కదా బాగా తెలుసు. అదిగో అక్కడ కొట్టాడు..ఇక్కడ కొట్టాడు అంటూ గోల మొదలవుతుంది. అదే మళ్లీ వీళ్లకు అవకాశం వస్తే, తమ మీడియాను వాడి భూమిలో కప్పేస్తారు. వార్తలు రానివ్వరు. అవకాశం రాకపోతే అదే మీడియాను వాడి యాగీ మొదలెడతారు.