ఏపీ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు బీజేపీకి ఏదీ దొరికినట్టు లేదు. లేని సమస్యపై నిరసనకు దిగడం ఏపీ బీజేపీకే చెల్లింది. ప్రజలు సమస్యగా భావించని అంశాన్ని బీజేపీ ఎందుకు నెత్తికెందుకో ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుకైనా కనీసం అర్థమవు తోందా? అనే ప్రశ్నలొస్తున్నాయి.
మతపరమైన విద్వేషాలను సృష్టించడంలో బీజేపీ ఆరితేరిందని తెలిసే… ఏపీ ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంది. అయినప్పటికీ ఏపీ బీజేపీ మాత్రం తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న రీతిలో వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ బీజేపీ నిరసనలకు దిగింది. గణేష్ మండపాల సంఖ్యను ఏపీ ప్రభుత్వం కుదిస్తోందని, ఇదంతా హిందూమతంపై దాడిలో భాగమని బీజేపీ ఆరోపిస్తోంది. విఘ్నాధిపతి వేడుకలకు విఘ్నాలా? ఇదేమి దుర్మార్గమని సోము వీర్రాజు ప్రశ్నించడం గమనార్హం. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు బీజేపీ పిలుపునివ్వడం విమర్శలకు దారి తీస్తోంది.
మరోవైపు ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు బీజేపీ నేతల వైఖరిని తప్పు పడుతున్నారు. అసలు చవితి వేడులకు ఎలాంటి విఘ్నాలు కలిగించలేదని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై, వినాయక విగ్రహాల నిమజ్జనంపైనా ఎలాంటి ఆంక్షలు లేవని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది పోలీసులు కొత్త ఆంక్షలు విధిస్తున్నారని కొందరు దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని ఆయన కోరారు.
అలాగే గణేష్ మండపాలకు ఎలాంటి ఫీజులు వసూలు చేయలేదని దేవాదాయశాఖ స్పష్టం చేసింది. రుసుం వసూలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అది నమ్మ వద్దని ఆ శాఖ ఉన్నతాధికారి కోరారు. ఈ నేపథ్యంలో చవితి వేడుకలకు విఘ్నాలు కలుగుతున్నాయని బీజేపీ నేతలు ఎలా విమర్శిస్తున్నారో వారికే తెలియాలి.
వినాయక చవితి వేడుకను రాజకీయంగా సొమ్ము చేసుకునే తాపత్రయం తప్ప బీజేపీకి మరే ఉద్దేశం లేదనే విమర్శలొస్తున్నాయి.