ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రానున్న ఎన్నికల్లో తగ్గేదే లేదంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2024లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తేల్చి చెబుతున్నారు. రెండు రోజుల క్రితం జనసేనాని పవన్‌కల్యాణ్ వైఖరిలో చిన్న మార్పు కనిపించడం, అది తమకు అనుకూలంగా ఉండడంతో బీజేపీలో ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ వేర్వేరు కాదని సోము వీర్రాజు చెప్పడం విశేషం.
సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన, బీజేపీ కలిసే ఉన్నాయని, రెండు పార్టీలు కలిసి రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేనల మధ్య పొత్తు, సీట్ల పంపకాలపై సాగుతున్న ప్రచారంపై స్పందించాలని సోము వీర్రాజుని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఆ విషయాన్ని పవన్నే అడగాలని ఆయన సమాధానం ఇచ్చారు.
రాష్ట్ర విడిపోయిన తర్వాత సరైన దిశ, దశ లేకపోవడానికి కుటుంబ రాజకీయాలే కారణమని ఆయన విమర్శించారు. ఇదే కుటుంబ పార్టీ టీడీపీతో 2014లో బీజేపీ పొత్తు పెట్టుకుని అధికారాన్ని అనుభవించిన విషయాన్ని సోము వీర్రాజు మరిచిపోయినట్టున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు రాజకీయ విభేదాలతో ఇటు రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు, అటు కేంద్రంలో టీడీపీ ఎంపీలు ప్రభుత్వం నుంచి బయటికొచ్చిన సంగతి తెలిసిందే.
గతంలో ఎన్నడూ కుటుంబ పార్టీలతో పొత్తులు పెట్టుకోనట్టు సోము వీర్రాజు నీతి వాక్యాలు చెప్పడం ఆయనకే చెల్లిందని ప్రత్యర్థులు తప్పు పడుతున్నారు. కనీసం జనసేనతోనైనా పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లి, గౌరవప్రదమైన ఓట్లు, సీట్లు తెచ్చుకుంటారేమో చూడాలి.