ఉగాది తెలుగువారికి ప్రీతిపాత్రమైన వేడుక. ఆ ఉగాది వైసీపీ ముహూర్తాలకు ఎపుడూ లింక్ ఉంటూ వస్తోంది. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక తొలి ఉగాది 2020 మార్చి 25న వచ్చింది. నాడు ఇళ్ళ పట్టాలు పెద్ద ఎత్తున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావించారు. కానీ అప్పటికి కరోనా వచ్చి పరిస్థితిని పూర్తిగా తల్లకిందులు చేసింది.
ఆ తరువాత రెండవ ఉగాది నాటికీ అదే పరిస్థితి. ఆ 2021 ఉగాదికి విశాఖకు పరిపాలనను తీసుకురావాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. 2022లో వైసీపీ పెట్టుకున్న ముహూర్తాలకు అనుకున్న విధంగా ఏమీ జరగలేదు. ఇపుడు నాలుగవ ఉగాది వస్తోంది. ఈ ఉగాది మార్చి 22న వస్తోంది. ఈసారి ఉగాదికి విశాఖకు రాజధాని తరలిరావడం ఖాయమని వైసీపీ మంత్రులు అంటున్నారు. గుడివాడ అమరనాధ్ అయితే రాసిపెట్టుకోండి కచ్చితంగా రెండు నెలల వ్యవధి మాత్రమే ఉంది అంటూ కౌంట్ డౌన్ ఫిక్స్ చేశారు.
విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉగాది ముందో వెనకో చెప్పలేం కానీ విశాఖకు రాజధాని రావడం తధ్యమని అంటున్నారు. ఇపుడు మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే తన విద్యా శాఖకు సంబంధించిన కార్యాలయాలు అన్నీ ఏప్రిల్ లో విశాఖకు తరలివస్తాయని అంటున్నారు.
దీనికి సంబంధించి తన శాఖ అధికారులకు ఆయన సూచనలు సంకేతాలు ఇచ్చారు. రాజధాని తరలివస్తే మొదట విశాఖకు వచ్చే ఆఫీస్ విద్యా శాఖ మాత్రమే అని ఆయన చెప్పారు. బొత్స చెబుతున్న దాన్ని బట్టి చూస్తే అంతా సిద్ధం అయిపోయింది అనే అనుకోవాల్సి ఉంటుంది.
ఇలా మంత్రులు వైసీపీ సీనియర్లు విశాఖకు రాజధాని తప్పనిసరిగా ఈ ఉగాదికి వస్తుందని చెబుతున్నారు. ఊరిస్తున్నారు. ఈ నెల 28న విశాఖ శారదాపీఠానికి వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముహూర్తం విషయంలో స్వరూపానందేంద్ర మహాస్వామినితో చర్చిస్తారు అని అంటున్నారు. ఆ ముహూర్తం చూసుకుని విశాఖకు రాజధాని రావడం తధ్యమని అంటున్నారు. ఈసారి మంత్రుల ప్రకటనలలో ధీమా చూస్తే ఇది కచ్చితంగా వైసీపీ ఉగాది నామ సంవత్సం అయ్యేలాగానే ఉంది అని అంటున్నారు.